మరింతగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కర్నాటకలో రూ.2 తగ్గించిన ప్రభుత్వం
ఇలాగే జరిగితే మూల్యం తప్పదన్న బాబా రాందేవ్
న్యూఢిల్లీ,సెప్టెంబర్17(జనంసాక్షి ): గత కొంతకాలంగా రికార్డుస్థాయిలో పరుగులు తీస్తున్న చమురు ధరలు సోమవారం కూడా పెరిగాయి. వందరూపయాల దిశగా ధరలు పరుగుల పెడుతున్నాయి. మరోవైపు ధరలు
తగ్గించే అవకాశాలున్నాయని యోగా గురు బాబా ర ఆందేవ్ అన్నారు. మరోవైపు కర్నాటక కూడా ఎపి తరహాలో రెండురూపాయలను తగ్గించింది. సోమవారం నాటి పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.06కు చేరింది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత చేరువైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44గా ఉంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే ముంబయిలో పెట్రోల్ ధర రూ. 90ని దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ. 83.91, చెన్నైలో రూ. 85.31గా ఉంది. ఇక డీజిల్ ధర కూడా నేడు మరింత పెరిగింది. దేశ రాజధానిలో డీజిల్‌పై 6 పైసలు పెరిగి లీటర్ ధర రూ. 73.78కి చేరింది. ముంబయిలో రూ. 78.33, కోల్‌కతాలో రూ. 75.53, చెన్నైలో రూ. 78గా ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై రూ.15.4, డీజిల్‌పై రూ. 14.08 పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం, ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తెచ్చేందుకు సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నా.. ప్రభుత్వం మాత్రం సుంకాలు తగ్గించేందుకు సుముఖంగా లేదు.
భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం తానే రంగంలోకి దిగింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌పై విధించే పన్నును తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది.
మూల్యం చెల్లించుకోక తప్పదు: యోగాగురు బాబా రాందేవ్
దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చి, పన్నుల్లో ఉపశమనం కల్పిస్తే, లీటరు పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానని అన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అంతేకాకుండా 28 శాతం శ్లాబ్‌ను తీసేయాలని బాబా రాందేవ్ సూచించారు. ఎన్‌డీటీవీ యువ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడంపై రాందేవ్ బాబా పలు ప్రశ్నలను లేవనెత్తారు. పన్నులను వాహనదారుల నుంచి కాకుండా.. ధనవంతలను నుంచి వసూలు చేయాలన్నారు. ఇంధనాలపై పెరుగుతున్న ధరలు, మోదీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ అంశాలు, మోదీ ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కల్పించడానికి నిరాకరించడం ఇవన్నీ ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై మొత్తంగా రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. అది కాక, రాష్ట్రాలు వ్యాట్‌లను విధిస్తున్నాయి. ఇంధన ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో నానాటికీ అసహనం పెరిగిపోతోందని రాందేవ్ పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు
తప్పవని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చాలా విధానాలు బాగున్నాయని, కానీ కొన్నింటిన్నీ సవరించాల్సి ఉందని చెప్పారు. వీటిలో అతిపెద్ద సమస్య ధరల పెరుగుదలేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాందేవ్ అన్నారు. రాఫెల్ డీల్‌పై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాందేవ్.. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నానని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీ తరుఫున ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు.




