ఆటగాళ్లకు కఢక్‌నాథ్ చికెన్ ఇవ్వండి!
– ఈ చికెన్ వల్ల ఎక్కువ ఉపయోగాలున్నాయి
– కోహ్లీ, బీసీసీఐకు లేఖరాసిన మధ్యప్రదేశ్ కృషి విజ్ఞాన కేంద్రం
ముంబయి, జనవరి3(జనంసాక్షి) : భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు మెరుగైన డైట్ కోసం కఢక్‌నాథ్ చికెన్ ఇవ్వండని మధ్యప్రదేశ్‌లోని జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐకు ఓ లేఖరాసింది. ప్రస్తుతం తీసుకుంటోన్న గ్రిల్డ్ చికెన్ కంటే మధ్యప్రదేశ్‌లో స్థానికంగా లభిస్తోన్న కఢక్‌నాథ్ చికెన్ వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయని వెల్లడించింది. ఆ వివరాలు వెల్లడిస్తూ విరాట్ కోహ్లీ, బీసీసీఐకు ఓ లేఖ రాసింది. విరాట్, ఇతర జట్టు సభ్యులు తమ డైట్‌లో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారని విూడియా కథనాల ద్వారా తెలుసుకున్నామని, అయితే దానిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని తెలిపింది. దాన్ని డైట్‌లో తీసుకోవడం కంటే.. తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్న కఢక్‌నాథ్ చికెన్‌ను వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయని విజ్ఞాన కేంద్రం సభ్యులు సూచించారు. హైదరాబాద్‌లోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ విూట్ నివేదిక ప్రకారం దానిలో ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయని వివరించింది. క్రికెట్
ఆటగాళ్లలో ఫిటెనెస్ గురించి చెప్పేటప్పుడు ముందుగా ప్రస్తావించేవారిలో కోహ్లీ పేరు కూడా ఉంటుంది. అయితే గతంలో వెల్లడైన కథనాల ప్రకారం.. మెరుగైన ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం వేగాన్ డైట్‌కి మారినట్లు విరాట్ వెల్లడించారు. దానికోసం అతడికి ఎంతో ఇష్టమైన బటర్ చికెను కూడా వదిలేసినట్లు చెప్పాడు.
కఢక్ నాథ్ చికెన్‌కు మధ్యప్రదేశ్‌లోని జబువా, ధార్ జిల్లాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కోడి మాంసం నలుపు రంగులో ఉంటుంది. అధిక సంఖ్యలో ప్రొటీన్లు, కొవ్వు స్థాయులు తక్కువగా ఉండటం వల్ల ఈ చికెన్‌కు చాలా డిమాండ్ ఉంది.