Wednesday, 4 November 2026

ఆడపడుచులకు అండగా ఉంటా

– ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా అందించాలి
– కేవలం తమ పార్టీ కార్యకర్తలకే ఇస్తామంటే కుదరుదు
– డ్వాక్రా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది
– త్వరలోనే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడుతుంది
– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
– అన్నవరంలో డ్వాక్రా మహిళలతో సమావేశమైన పవన్‌
కాకినాడ, నవంబర్‌3(జ‌నంసాక్షి) : ఆడపడుచులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని దేవీ కల్యాణ మండపంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు తమ సమస్యలను పవన్‌కు తెలిపారు. జనసేన మహిళలమని పసుపు, కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 లు ఇవ్వడం లేదని తెలిపారు. జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సు చేస్తేనే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తున్నారన్నారు. జన్మభూమి కార్యకర్తల కనుసన్నలలో డ్వాక్రా ఋణాలు
మంజూరవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సైతం అధికార పార్టీ వారు ధ్వంసం చేస్తున్నారని, ఫ్లెక్సీలను కూడా తొలగించేస్తున్నారని పలువురు మహిళలు పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ..  జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలకతీతంగా అందరికీ అండగా ఉంటామన్నారు. మహిళల, ఆడపడుచుల, అక్కచెల్లెళ్ల సమస్యలు ప్రత్యక్షంగా చూసినవాణ్ణి అని, వారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని పవన్‌ కళ్యాణ్‌ హావిూ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్నారు. కనీసం చట్ట సభల్లో మూడవ వంతు మహిళలకి రిజర్వేషన్‌ ఖచ్చితంగా ఉండాలన్నారు.  త్వరలోనే డ్వాక్రా మహిళలకు శిక్షణా సదస్సు నిర్వహిస్తామన్నారు. అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరని, త్వరలోనే రాష్ట్రానికి పట్టిన చందగ్రహణం తొలగిపోతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ చెందాలని అన్నారు.  ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉండాలి గానీ కేవలం తమ పార్టీ కార్యకర్తలకి, తమ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తామంటే కుదరదని అన్నారు. డ్వాక్రా పథకాలలో తీవ్ర అవకతవకలున్నాయని మహిళలు చెబుతున్నారన్నారు. బ్యాంక్‌ ప్రతినిధులే డ్వాక్రా మహిళల ఇంటికి వచ్చి సేవలు అందించాలన్నారు. డ్వాక్రా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. మహిళలకు అన్ని పార్టీలు కూడా చేయూతినివ్వాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుందన్నారు. మహిళలకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులు వచ్చినప్పుడు సమాజం బాగుంటుందన్నారు.
త్వరలోనే డ్వాక్రా మహిళలతో బహిరంగ సభ – నాదెండ్ల మనోహర్‌
త్వరలోనే డ్వాక్రా మహిళలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మాజీ స్పీకర్‌, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.  మహిళలకు రాజకీయ పరమైన శిక్షణనిచ్చి వారిలో చైతన్యం కలిగించాలన్నారు. వృత్తి నైపుణ్యత కూడా పెంపొందించే చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల బాధలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ డ్వాక్రా మహిళలతో సమావేశం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించడం అన్యాయమని ఆయన అన్నారు. ఈ గ్రామానికి సేవ చేయాలనే మనస్తత్వం కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ విధంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని జనసేన పార్టీ ముందుకెళుతుందన్నారు.