Tuesday, 3 November 2026

ఆదరించి ఆశ్రయమిచ్చిన స్నేహితుడినపైనే పగ

ఓ యువతి కారణంగా సతీష్‌పై ద్వేషం
పార్టీ చేసుకుందామంటూ పిలిచి హత్య
హంతకుడు హేమంత్‌ అరెస్ట్‌
వివరాలు వెల్లడించిన డిసిపి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసులో మిస్టరీని పోలీసుల ఛేదించారు. నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హేమంత్‌ ఇంట్లోనే సతీష్‌ మృతదేహాన్ని గుర్తించినట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. గత నెల 28న హత్య జరిగితే.. 29న సతీష్‌ భార్య కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. సతీష్‌, హేమంత్‌ కోరుకొండ సైనిక్‌ స్కూల్లో చదువుకున్నారని తెలిపారు. సతీష్‌కు సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ నేర్పించే ఇనిస్టిట్యూట్‌ ఉందన్నారు. హేమంత్‌ ఏ ఉద్యోగం లేక.. సతీష్‌ వద్దకు వచ్చి ఉద్యోగంలో చేరాడన్నారు. కొద్దికాలం తర్వాత సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ ఇనిస్టిట్యూట్‌ను కాస్త సాప్ట్‌వేర్‌ కంపెనీగా చేసి కూకట్‌పల్లికి మార్చారని వెల్లడించారు. వీరి కంపెనీలో విజయవాడకు చెందిన ప్రియాంక చేరిందన్నారు. సతీష్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉండేదన్నారు. కానీ అతను ఎక్కువగా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ప్రియాంక.. హేమంత్‌కు దగ్గరై సహజీవనం చేస్తుందన్నారు. హేమంత్‌కు అప్పటికే పెల్ళైంది.. కానీ భార్య దూరంగా ఉంటుందని చెప్పారు. హేమంత్‌-ప్రియాంక సంబంధం ఇష్టం లేని సతీష్‌ వారిద్దరిని హెచ్చరించాడన్నారు. అయితే ప్రియాంకను తనకు దూరం చేస్తున్నాడన్న కోపంతో పక్కా ప్లాన్‌తో పార్టీ చేసుకుందామంటూ సతీష్‌ను హేమంత్‌ తన ఇంటికి పిలిచాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వాహనాన్ని సైతం హేమంత్‌ సిద్ధం చేసుకున్నాడు. సతీష్‌ ఇంటికి రాగానే తలపై రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడన్నారు. సతీష్‌ మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు హేమంత్‌ కట్టర్‌ కూడా కొనినట్లు తెలిపారు. కానీ ముక్కలు చేయడం వీలుకాక మృతదేహాన్ని ఇంట్లో పెట్టి పారిపోయాడన్నారు. ఇప్పటివరకూ సతీష్‌ హత్య కేసులో హేమంత్‌ ఒక్కడే ఉన్నట్టుగా ఆధారాలు లభించాయని వెల్లడించారు. ప్రియాంక మొబైల్‌లో కొన్ని ఛాటింగ్స్‌ డిలీట్‌ అయ్యాయని…వాటిని మళ్లీ బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియంకతో హేమంత్‌కు అక్రమసంబంధం ఏర్పడటంతో హేమంత్‌ భార్య అతడికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. అనంతరం ప్రియంకతో కలిసి హేమంత్‌ కేబీహెచ్‌బీ సెవన్త్‌ ఫేజ్‌లో ఇండిపెండెంట్‌ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం సతీష్‌కు కొంతకాలం వరకు తెలియదు. కేబీహెచ్‌బీలో ఉన్న కంపెనీ బ్రాంచ్‌ నష్టాలు రావడంతో హేమంత్‌ను సతీష్‌ నిలదీశాడు. నీవు కంపెనీని సరిగా పట్టించుకోవడం లేదు. ప్రియంకతో సాన్నిహిత్యంగా ఉంటున్నావని సతీష్‌ మందలించాడు. అంతేకాకుండా హేమంత్‌ జీతం కూడా తగ్గించాడు. దీంతో హేమంత్‌ సతీష్‌పై ద్వేషం పెంచుకున్నాడు. సతీష్‌ను పార్టీ చేసుకుందామని హేమంత్‌ నమ్మించి ఇంటికి పిలిచి హత్య చేసినట్లు విచారణలో తేలిందని డీసీపీ వెల్లడించారు.