Tuesday, 3 November 2026

ఆధ్యాత్మిక ముసుగులో..

7
ఆశ్రమాల్లో అశ్లీలం, అక్రమాలు

కటకటాల్లోకి ఆశ్రమ అధిపతులు

దైవంపేరుతో భక్తులకు శఠగోపం

ఒక్కో బాబాది ఒక్కో విధమైన మోసం

తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన

మదర్సాలపై అనవసర నిఘా

దొంగబాబాల ఆగడాలపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : ‘దేవుడి గుళ్లు.. ఆధ్యాత్మిక ఆశ్రమాలు మానవజాతికి ప్రశాంత నిలయాలు.. ఆ ప్రదేశాలు ప్రజలకు పాపనాశనాలు.. అంతేకాదు.. ఆ దైవశక్తి ఆశీర్వాదాలు.. సర్వపాపాలు, కష్టాలను దూరం చేసి మనశ్శాంతినిచ్చే ఆనవాళ్లు’ అని దైవాన్ని నమ్ముకుని జీవించే ప్రతీ మనిషి విశ్వాసం. ఈ విశ్వాసమే.. భక్తులను పేరుగాంచిన ఆలయాలు.. బాబాల వద్దకు పరుగుతీయిస్తుంది. భక్తులకున్న ఈ బలహీనతే.. కాషాయ వస్త్రాలు ధరించిన  బాబాలకు కార్పొరేట్‌ స్థాయిలో కాసులు కురిపిస్తోంది. అనతికాలంలోనే అత్యంత ధనవంతులను చేస్తోంది. ఈ ధనంతో కళ్లకు కావరమెక్కిన బాబాలు ఆధ్యాత్మికతను పక్కన పెట్టి అశ్లీల సంస్కృతికి తెరతీస్తున్నారు. ఒక్కోబాబా.. ఒక్కో స్టైల్లో మోసాలకు దిగుతున్నారు. అమాయక భక్తులతో నానా సేవలు చేయించుకుంటున్నారు. అంతిమంగా దేవుడనే ఆయుధాన్ని ప్రయోగించి బాబాలు భారీ దోపిడీకి పాల్పడుతూ.. సకల రాజభోగాలను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడో లెక్కతప్పి అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలవుతున్నారు. దీంతో వీరి జీవితం ఆశ్రమాల నుంచి కాస్త కారాగారం వైపు పరుగెడుతోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఇలాంటి మోసాలపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.

దేవుడిమీది నమ్మకంతో.. ఆలయాలు, బాబాల చెంతకు..

పుట్టెడు కష్టాల్లో ఉన్న అమాయక ప్రజలు.. తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కోలేని అమాయక ప్రజానీకం.. తమ కష్టాలకు తాము చేసిన తప్పులే కారణమని, ఆ తప్పులను క్షమించేది దేవుడేనని, ఆ దేవుడికి తమ మొక్కులు చెల్లిస్తే కష్టాలు, సమస్యలు దూరమవుతాయని పేరుగాంచిన ఆలయాలు, దేవుడి అవతారమెత్తిన బాబాల చెంతకు చేరుతున్నారు. అంతే.. ఈ బాబాలు భక్తులకు ఆధ్యాత్మిక ముసుగేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. తమను నమ్మిన భక్తులకు శఠగోపం పెడుతున్నారు.

మొన్న ఆశారాం.. నిన్న నిత్యానంద.. నేడు రాంపాల్‌…

తమలో దేవుడున్నాడని, తాము పట్టుకున్నది ఏదైనా బంగారమవుతుందని, తమను ఆశ్రయిస్తే.. తమ వద్ద ఉన్న దైవశక్తితో మానవాళికుండే ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా రెప్పపాటులో మటుమాయం చేస్తామని కొందరు బాబాలు నమ్మబలుకుతున్నారు. అలాంటి వారిలో బెంగళూరులో ఉన్న ఆధ్యాత్మిక ఆశ్రమం పీఠాధిపతి స్వామి నిత్యానంద సరస్వతి, హర్యానాలోని బర్వాలా ఆశ్రమం అధిపతి రాంపాల్‌ స్వామిజీలు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని ఆశ్రమ అధిపతి సంత్‌ శ్రీ ఆశారాం బాపు ఉన్నారు. వారి మాయమాటలకు లక్షల మంది భక్తులు మోసపోయారు. ఎందరో యువతులు వారి లైంగికవేధింపులకు గురయ్యారు. అందుకు నిదర్శనం గతంలో నిత్యానంద స్వామి అశ్లీల ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ వివాదం ముగియక ముందే మరో దొంగబాబా రాంపాల్‌ ఇవే కారణాల వల్ల కటకటాలపాలయ్యారు. అలాగే సంత్‌ శ్రీ ఆశారాం బాపు కూడా ఇలాంటి కారణాలతోనే అప్రతిష్టపాలయ్యారు. వీరే కాదు.. దేశంలో స్వామీజీలు, బాబాల అవతారమెత్తిన ఎందరో సన్యాసులు భక్తులపై దేవుడి ముసుగేసి దోపిడీలు, మోసాలు చేస్తున్నారు. మహిళా భక్తులను భయభ్రాంతులకు గురిచేసి వారిని లైంగికంగా వేధిస్తున్నారు. ఇలాంటి వికృత చేష్టల వల్ల దేవుళ్ల ప్రతిష్టను, ఆధ్యాత్మికతను మంటగలుపుతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా ఆలయాలు, ఆశ్రమాల్లో అశ్లీల సంస్కృతిని పెంచిపోషిస్తున్నారు.

ఈ స్వామిజీలు.. చట్టాల ఉల్లంఘనులు…

తాము దైవాంశసంబూతులమని.. బాబాలు, స్వాములు యథేచ్ఛగా రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న జరిగిన రాంపాల్‌ వ్యవహారం ఇందుకు అద్దంపడుతుంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రాంపాల్‌ను అరెస్టు చేసేందుకు వెళితే వారిపై బాబా తన భక్తులతో దాడులకు ఉసిగొల్పాడు. తన మాయమాటలతో భక్తులను ప్రైవేటు సైన్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏకంగా పాతిక లక్షల మందిని ఇలా తయారు చేసుకున్నాడంటే ఈ బాబా మంత్రం ఏ విధంగా మాయచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం నుంచి సస్పెండై.. స్వామి అవతారమెత్తి కోట్లు సంపాదించాడు. 15 ఎకరాల్లో పెద్ద ఆశ్రమాన్ని స్థాపించాడు. ఈ ఆశ్రమాన్ని తన అశ్లీల కార్యక్రమాలకు, అక్రమాలకు ఆలయంగా మార్చేశాడు. గతంలో సంత్‌ శ్రీ ఆశారాం బాపు కూడా ఆధ్యాత్మిక గురువుగా చెలామణి అయ్యాడు. ఈ ముసుగులో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపణ అయ్యింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు వస్తే.. తన భక్తులతో పోలీసులపైకి దాడులకు దిగాడు. అలాగే పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి ఆశ్రమంలో కాల్పులు జరిగిన విషయాన్ని మరువలేం.

మదర్సాలలపై అనవసర నిఘా…

దేశంలో పేరుప్రఖ్యాతులు గాంచి అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పెద్దపెద్ద ఆశ్రమాల నిర్వాకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆయా ఆశ్రమాల్లో జరిగే రాసలీలల గురించి ఆరాతీయవు. అత్యధిక భక్తజనం వచ్చే ఆశ్రమాలలో పర్యవేక్షణ చర్యలను నిరంతరం కొనసాగించవు. కానీ.. పేదపిల్లలు, అనాథపిల్లలు చదువుకునే మదర్సాలలపై పోలీసులు అనవసర నిఘా పెడుతున్నారు. ఆయా సంస్థలపై అర్ధరాత్రి దాడులు చేసి విచారణ చేస్తారు. ఇలాంటి చర్యలతో అక్కడి పిల్లలను నానా ఇబ్బందులకు గురిచేస్తారు. ‘దీన్‌దునియా’ పేరుతో సాగే ఈ సంస్థలపై పోలీసులు అనవసర నిఘాను మానుకోవాలి. పెద్దపెద్ద ఆశ్రమాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిఘా పెట్టాలి. తద్వారా వాటి అంతుచూడాలి.

స్వామి అవతారమెత్తిన సన్యాసులను నమ్మొద్దు…

దేవుడి మీద భారం వేసి గుడ్డిగా బాబాలను దర్శించుకునే భక్తులు ఆయా బాబాల కార్యకలాపాలను పరిశీలించాలి. మరీముఖ్యంగా స్వామి అవతారమెత్తిన సన్యాసులను గుడ్డిగా నమ్మితే ఒంటిమీద బట్టలు కూడా లేకుండా దోచుకుంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆశ్రమాలు నడిపే బాబాలు, స్వాముల పట్ల మరింత జాగ్రత్త అవసరం అని, దాన్ని భక్తులు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ‘జనంసాక్షి’ యావత్‌ భక్తజనానికి సూచిస్తోంది. ఒక భక్తులేకాదు.. యావత్‌ దేశ ప్రజలు ఇలాంటి దొంగబాబాలు, స్వాములు, సన్యాసుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండి దేశంలో మసకబారిపోతున్న ఆధ్యాత్మికతను పరిరక్షించుకోవాలని, లేకుంటే ఇలాంటి వారి వికృత కార్యకలాపాలకు దేశ ప్రతిష్ట, సంస్కృతి మరింత మంటగలిసిపోతుందని హెచ్చరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *