Tuesday, 3 November 2026

ఆపదలో మహిళలు షీ-టీంను సంప్రదించండి..!!

– మహిళలకు అవగాహన కల్పిస్తున్న షీ- టీమ్ ఇంచార్జి నర్సిములు
పరిగి, జూన్20(జనంసాక్షి) :
ప్రస్తుత సమాజంలో మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను అరికట్టేందుకే షీ- టీమ్ వ్యవస్థ పనిచేస్తుందని, ఆపద సమయంలో మహిళలు షీ-టీంను సంప్రదించాలని పరిగి డివిజన్ షీ- టీమ్ ఇంచార్జి నర్సింలు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఎన్. కోటి రెడ్డి, పరిగి డిఎస్పి జి. శ్రీనివాస్ ల ఆదేశానుసారం పరిగి పోలిస్టేషన్‌ పరిధిలోని రంగంపల్లి గేటు సమీపంలో షీ- టీం ఇన్చార్జి నర్సింలు ఆధ్వర్యంలో షీ- టీంపై మహిళలకు, వాహన దారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీ- టీమ్ ఇంచార్జ్ నర్సింలు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న వేధింపులు,  అఘాయిత్యాల బారిన పడకుండా తమని తాము కాపాడుకునేందుకు మహిళలు డైల్ 100, షీ- టీమ్ 181 నంబర్లను సంప్రదించాలని అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా,  కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు, మద్యపాన నిషేధం, బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాలు, గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం మొదలగు అంశాలపై మహిళలకు, వాహనదారులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే ఆపద సమయంలో మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా షీ-టీమ్(181) ను సంప్రదించాలని, షీ-టీమ్ ను సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా వుంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రయాణికులు, గ్రామస్థులు, షీ టీం సభ్యులు శ్రావణి, నహీం, తదితరులు పాల్గొన్నారు.