హైదరాబాద్: మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఆంధ్రా-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం(ఏఓసీబీ)పై పట్టు బిగిం చేందుకు కేంద్రం వేగంగా పావు లు కదుపుతోంది. ‘ఆపరేషన్ ఆల్ ఔట్’ పేరుతో భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభిస్తోంది. ఈ వేటలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయి. మావోయిస్టులు ఏఓబీలోనే ఆశ్రయం పొందుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు వారికి కలిసి వస్తుండగా కూంబింగ్ నిర్వహించే బలగాలు చొచ్చుకుని వెళ్లలేకపోతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో గత నెలలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు సాగించిన మారణకాండ తరవాత కేంద్రం తన వ్యూహాలను పూర్తిగా మార్చుకుంది. రాష్ట్రాలతో కలసి ఉమ్మడిగా గాలింపు చేపట్టాలని నిర్ణయిం చింది. ‘ఆపరేషన్ ఆల్ ఔట్’లో బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో పాటు మూడు రాష్ట్రాల పోలీసులు, నిఘా, ఆపరేషనల్ విభాగాలు పాల్గొంటున్నాయి. ఒడిశాలో బీఎస్‌ఎఫ్ బలగాలు ఇప్పటికే మావోయిస్టులపై పైచేయి సాధించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) నిఘా, గ్రేహౌండ్స్ విభాగాలు మావోయిస్టులపై పూర్తి స్థాయిలో పట్టు సాధించగలిగాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు విభాగాలు పలు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచాయి. ‘ఆపరేషన్ ఆల్ ఔట్‌లో’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో సాంకేతిక నిఘా కోసం మానవ రహిత విమానాలు, బలగాల తరలింపు కోసం ట్రూప్ క్యారియర్ హెలికాఫ్టర్లను సైతం వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.




