– భవిష్యత్‌లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదు
– ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం
– రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్5 (జనంసాక్షి): శనివారం సాయంత్రం 6గంటలు దాటిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులు తమ విధుల్లో చేరకపోతే వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్‌లో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. 3 నుంచి 4వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం జరుగుతుందని అన్నారు. ఆర్టీసీ బస్సులు నడపడానికి డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం, వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యాధావిధిగా నడుపుతామని అన్నారు. 6నుంచి 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వటం జరుగుతుందని, శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తుందని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీపై ప్రత్యామ్నాయ విధానం ఖరారుకు ఆదివారం ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహిస్తామని తెలిపారు. శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆరు దాటితే.. ఆర్టీసీ ఉద్యోగులు కారు




