Monday, 2 November 2026

ఆర్టీసీ కార్మికుల ముట్టడి

 

 

 

రెండోరోజూ విధుల్లోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి )  : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ ఆద్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. విధుల్లోకి చేర్చుకోవాలని డిపోల ఎదుట కార్మికులు రెండో రోజు ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్దకు కార్మికులు చేరుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో యథావిధిగా ప్రత్యామ్నాయ బస్సులు నడుస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే అధికారులు విధుల్లోకి అనుమతిస్తున్నారు. సికింద్రాబాద్‌ హకీంపేట డిపో వద్ద ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జేబీస్‌ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం బురాన్‌పురంలో ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు మహిళా కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.