Monday, 2 November 2026

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతైన దుకాణంలోని వస్త్రాలు
– సుమారు రూ.3కోట్ల ఆస్తినష్టం
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ వస్త్ర దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు పక్కనే దుకాణం ఉండటం, చుట్టు పక్కల ఇంకా ఇతర షాపులు, నివాసాలు ఉండటంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసిన తరవాత ఈ ప్రమాదం జరిగింది. ముందు కింది అంతస్తులోని లిఫ్ట్‌ నుంచి పొగలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన భద్రతా సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో కోఠికి వెళ్లే వాహనాలను మోంజాయి మార్కెట్‌ విూదుగా దారి మళ్లించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అదృష్టవశాత్తూ అర్థరాత్రి వేళ ప్రమాదం జరగటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణపు యాజమాన్యం తెలిపింది.