– తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్,అక్టోబర్29(జనంసాక్షి):
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో ప్రకటించినట్టు కాకుండా.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విజ్ఞప్తి మేరకు అమలు తేదీని మార్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఈ పరిహారం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు గతంలో లక్షన్నర మాత్రమే పరిహారం ఇచ్చేవారు. అవి అప్పులకు కూడా సరిపోయేవి కాదు. దీంతో, ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి రైతు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉండేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉంటే నిబంధనలు సడలించి వారికి కళ్యాణలక్ష్మి కింద కూడా రూ. 51 వేలు సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.





