
– గుడిమళ్ల రవి కుమార్ వైపు మొగ్గు
– కేసీఆర్‌కు నిర్ణయ అధికారం
– విస్తృస్థాయి సమావేశం నిర్ణయం
హైదరాబాద్,అక్టోబర్29(జనంసాక్షి):
ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వరంగల్ లోక్‌సభలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిని సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రకటిస్తారని అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. వరంగల్ పార్లమెంటు ఉపఎన్నికలో అభ్యర్థిని శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలు, వరంగల్ జిల్లా తెరాస నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థిని నిర్ణయించే అధికారం కేసీఆర్‌కే కట్టబెడుతూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెరాస అభ్యర్థిగా గుడిమళ్ల రవికుమార్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన అభ్యర్థిత్వంపై అంతా మొగ్గు చూపారని సమాచారం. దీంతో వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కే అప్పగించారు. కాగా రేసులో జేఏసీ నేత గుడిమళ్ల రవికుమార్ ముందున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ఆశావాహులందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చి…బాగా చదువుకున్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. ఇక వరంగల్ ఉప ఎన్నిక కోసమే నామినేటెడ్ పోస్టులు వాయిదా వేసినట్లు కేసీఆర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో అందరికి న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా వరంగల్ ఉప ఎన్నికలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అభ్యర్థిని సిఎం ప్రకటిస్తారని అన్నారు.
వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అన్నా టీఆర్‌ఎస్ గెలుపు ముమ్మాటికి ఖాయమన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. అవేవి తెలుసుకోకుండా ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. నవంబర్ 1న ఉదయం పదకొండు గంటలకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతను ఒక్కో మంత్రికి సీఎం
అప్పగించారని తెలిపారు. నవంబర్ 17 లేదా 18 తేదీల్లో సీఎం కేసీఆర్ వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి పోటీ చేయండి బాబూ అనే స్థితిలో ఆ పార్టీలు ఉన్నాయని వివరించారు. అలాంటి పార్టీలు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పదహారు మాసాలుగా చేస్తోన్న మంచి పనులను చూసి ప్రజలు తమకు ఓటేస్తారని నమ్మకం ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ప్రతిపక్షాలు నోరుమెదపని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఢిల్లీ, బీహార్ ఎన్నికల ఫలితాలను రిఫరెండమ్‌గా స్వీకరిస్తుందో లేదో చెప్పాలని సవాలు విసిరారు. వరంగల్ ఉపఎన్నిక ప్రచార బాధ్యతలను మంత్రులకు అప్పగించినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు మంత్రులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పరకాలలో ఈటల రాజేందర్, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హరీశ్‌రావు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గలో కేటీఆర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, వర్ధన్నపేటలో జోగు రామన్న, పాలకుర్తిలో జగదీశ్‌రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ మంత్రులకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నిక అన్ని పార్టీల మధ్య పోటా పోటీగా సాగ నుండటంతో.. టీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థి ఎన్నిక నుంచి.. ప్రచారం వరకూ ప్రతి అంశంపై స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ గడ్డవిూద విజయ కేతనం ఎగరేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా.. మంత్రులకు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు.




