Tuesday, 3 November 2026

ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జ్‌

ఇంటికి చేరుకున్న ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక సోమవారం ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మూడు వారాల పాటు తనను క్షేమంగా చూసుకున్న ఎయిమ్స్‌ వైద్యులు, నర్సులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటికి తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మూడు వారాల పాటు నన్ను క్షేమంగా చూసుకున్న వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, స¬ద్యోగులకు నా హృదయపూర్వక అభినందనలు’ అని జైట్లీ ట్వీట్‌ చేశారు. జైట్లీ ఆసుపత్రిలో ఉండటంతో ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు అదనపు బాధ్యతల కింద అప్పగించారు. 65ఏళ్ల జైట్లీ గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఏప్రిల్‌ ఆరో తేదీనే జైట్లీ తన అనారోగ్యం గురించి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచే పనిచేశారు. కానీ, వైద్యులు ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో చికిత్స నిమిత్తం మే 12న ఆయన ఎయిమ్స్‌లో చేరగా.. 14న శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి మూడు వారాల పాటు జైట్లీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఆసుపత్రిలో ఉన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసుపత్రి నుంచే ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా అభినందనలు తెలిపారు.