బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రం మొత్తంలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. రేపటి నుంచి రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంమొత్తంలో వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్ లో ఉన్న చెరువులకు జలకళ వచ్చింది. దాదాపు ఏడు వేల చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండువేలకు పైగా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువ చెరువులు అలుగు పోస్తున్నాయి.
రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిన్న పొద్దుగాల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రెండు జిల్లాల్లో ముసుర్లు కమ్ముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గత 24 గంటల్ల రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో 6 సెంటీమీటర్లు వర్షపాతం రికార్డయింది. కూసుమంచి, సంగారెడ్డి, కొత్తగూడెంలో 4 సెం.మీ., నారాయణ్ ఖేడ్, జుక్కల్, మాచారెడ్డి, మధిరలో 3 సెం.మీ, వెంకటాపురం, మెదక్, పినపాక, గట్టు, బోధన్, నల్లబెల్లి, బోనకల్, అలంపూర్ లో 2 సెం.మీ., హైదరాబాద్, గోవిందరావుపేట, మోమిన్ పేట, ఏటూరునాగారం, పరిగి, బోథ్, సదాశివనగర్, కొడంగల్, పరకాల, ఉట్నూర్ లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా వైపు కదులుతోంది. పడమర దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం ప్రభావంతో… ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ బాగా ఎఫెక్ట్ ఔతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడ్తయని చెప్పింది. అక్కడక్కడా అతిభారీ వర్షాలు కూడా పడొచ్చని సూచించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని.. దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లోనూ మోస్తరు జల్లులు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.





