విజయవాడ : ప్రపంచ మూడవ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు, ప్రముఖ కవులు, రచయితలు, పండితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మాతృభాషతోనే సర్వతోముఖ వికాసం సాధ్యపడుతుందని అన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చని అయితే తెలుగు భాషను మరచిపోరాదన్నారు. పరభాష వ్యామోహంలో పడి తెలుగును మరచిపోతున్నామని…ఇంగ్లీష్ భాష ఓకే…అయితే ఇంగ్లీష్ మనస్తత్వం వద్దని ఆయన సూచించారు. తల్లిలాంటి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. యాసలు వేరైనా తెలుగు భాష అంతా ఒకటే అని.. తెలుగు రచనలను ఇతర భాషల్లోకి అనువదించాలన్నారు.
కాగా విజయవాడ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు. 13 జిల్లాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో పాటు జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం కేంద్రం తరపున వెంకయ్యనాయుడు రూ.350 కోట్ల చెక్ను మంత్రి నారాయణకు అందచేశారు.




