Tuesday, 3 November 2026

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు భారీగా ఏర్పాట్లు

హాల్‌ టిక్కెట్ల పంపిణీ పూర్తి

1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల హడావిడి మొదలయ్యింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. హాల్‌టికెట్ల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఏ అశోక్‌ తెలిపారు. హాల్‌టికెట్లు అందని వారు సంప్రదించాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ చేసుకొనే విధానాన్ని గతంలోనే తీసుకొచ్చారని, దానినే ఇప్పుడు కూడా కొనసాగిస్తామని బోర్డు సెక్రటరీ తెలిపారు. పరీక్షల ప్రారంభానికి అరగంట ముందే యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌, ఒన్‌టైం పాస్‌వర్డ్‌ సహాయంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందరు. ప్రాక్టికల్‌ పరీక్షల జవాబు పత్రాలను అదేరోజు మూల్యాంకనం చేసి, వేసిన మార్కులను తిరిగి అదేరోజు బోర్డు వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. వీటికి 3,27,761 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ నుంచి 1,59,429 మంది, బీపీసీ నుంచి 89,496 మంది, జాగ్రఫీ నుంచి 261 మంది, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం నుంచి 42,649 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 35,926 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగు విడుతలుగా జరిగే ప్రాక్టికల్స్‌కు ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకుల, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు కలిపి మొత్తం 1,733 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు బోర్డు సెక్రటరీ ఏ అశోక్‌ తెలిపారు. ఎగ్జామినర్లుగా 6,314 మంది అనుభవమున్న జూనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేశామన్నారు. ప్లయింగ్‌ స్క్వాడ్స్‌, ఉన్నతస్థాయి కమిటీ, జిల్లా పరీక్షల కమిటీలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు.