Tuesday, 3 November 2026

ఇంటికి చేరిన వరవరరావు 

– కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని తన నివాసానికి తరలించిన పోలీసులు
– సెప్టెంబర్‌ 6 వరకు గృహనిర్భందం
హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం నుంచి సెప్టెంబర్‌ 6 వరకు వరవరరావును గృహనిర్బంధంలో ఉంచనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ భద్రత మధ్య గాంధీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.  ప్రధాని హత్యకు కుట్ర రచన, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వరవరరావుపై ఉన్నాయి. వరవరరావు ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పుణె తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వరవరరావు సహా ఐదుగురు పౌరహక్కుల నేతలను పుణె పోలీసులు అరెస్టు చేశారు.  దీంతో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసుల వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రజా సంఘాల నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. మరోవైపు వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ పలువురు ప్రజాసంఘాల నేతలు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన కోర్టు.. పౌరహక్కుల కార్యకర్తలను కారాగారంలో పెట్టొద్దని.. గృహనిర్బంధంలోనే ఉంచి.. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం వరవరరావును హైదరాబాద్‌లోని తన నివాసానికి పోలీసులు తరలించారు. కాగా సెప్టెంబర్‌ 6వరకు వరవరరావును పోలీసులు గృహనిర్భందంలో ఉంచి విచారించనున్నారు.
–