ఇజ్రాయిల్‌ దాడుల్లో 31 మంది మృతి

గాజానగరం : హమాస్‌ అధీనంలోని గాజా భూభాగంపై ఇజ్రాయిల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడులలో చిన్న పిల్లలు, మహిళలతో సహా 31 మంది పాలస్తీనియన్‌లు  చనిపోయారు. ఈ రెండు దేశాలమధ్య దాడులు, ప్రతిదాడులు తిరిగి చెలరేగిన తర్వాత చోటుచేసుకున్న హింసాకాండలో మృతులసంఖ్య ఈ ఆదివారంనాటిదే అధికం, దీనితో మొత్తం ప్రాణనష్టం 77కు చేరింది. పోలీస్‌శాఖ ప్రధాన కార్యాలయం, రెండు మీడియా కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అటు గాజానుంచి జరిగిన దాడులలో ముగ్గురు ఇజ్రాయిలీలు చనిపోయారు.
మరోవైపు ఇరుపక్షాలమధ్య రాజీకీ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నేడో, రేపో ఒప్పందం కుదురుతుందని పాలస్తీనా అథికారవర్గాలు చెప్పాయి. రాజీకోసం ఈజిస్ట్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. గాజానుంచి దాడులు ఆగితేనే రాజీకి కూర్చుంటామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతాన్యాహు స్పష్టీకరించారు.