Tuesday, 3 November 2026

ఇది వర్ణించలేని ఆనందం

51471626829_625x300తన కూతురు సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు. భవిష్యత్తులో తన కూతురు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయుల విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అయితే ప్రత్యర్థిపై తొలి గేమ్ సింధు గెలిచినా ఆమెపై గెలుపు అంత సులువుకాదని మరోసారి పీవీ రమణ ప్రస్తావించారు.

బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు కాస్త నెర్వస్గా కనిపించిందని ఆమె తల్లి విజయ అన్నారు. కచ్చితంగా సింధు స్వర్ణం నెగ్గుతుందని భావించామని, అయితే అనవసర తప్పిదాలు చేయడం వల్లే కూతురు స్వర్ణం సాధించలేక పోయిందని పేర్కొన్నారు. సింధు తల్లి విజయ మీడియాతో మాట్లాడుతూ.. ‘శారీరకంగానూ కాస్త అలసిపోవడం సింధు ఆటపై ప్రభావం చూపింది. మొదట్లో మెరుగ్గానే ఆడినా చివరికొచ్చే సరికి కాస్త టెన్షన్ పడ్డట్లు కనిపించింది. మరో ప్రయత్నంలో కచ్చితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కూతుళ్లను కనడం భారమని భావించే తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇకనుంచి మార్పు వస్తుందని, తన కాన్పు సమయంలో కూతురే పుట్టాలని కోరుకున్నట్లు పుత్రికోత్సాహంలో ఉన్న ఆమె తెలిపారు.

రియోలో సింధు రజత పతకం గెలవడం పట్ల.. ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఒలింపిక్స్ కు వెళ్లాలనేది ప్రతి ఒక్క క్రీడాకారుని కల అని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తండ్రి పీవీ రమణ అన్నారు. రియో ఒలింపిక్స్ లో పాల్గొనడంతో సింధు కల నెరవేరిందన్నారు. అంతే కాదు.. ఆమె పతకంతో తిరిగి వస్తోందని, ఈ ఆనందాన్ని తాను మాటల్లో వర్ణించలేనని ఆయన అన్నారు. షటిల్లో ఇంతవరకు రజత పతకమే రాలేదని, ఆ కలను సింధు సాధ్యం చేసిందని చెప్పారు. కోచ్ గోపీచంద్ తో పాటు, తన కూతురు విజయానికి సహకరించిన అందరికి రమణ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *