– ముమ్మాటికీ సోనియానే తెలంగాణ ఇచ్చింది
– ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్
హన్మకొండ , వరంగల్,అక్టోబర్19(జనంసాక్షి): ఇద్దరు ఎంపీలతో తెరాస తెలంగాణ తేలేదని, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నాడు.రానున్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. సోమవారం హన్మకొండలోని నందనగార్డెన్స్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దిగ్విజయ్, ఆర్.కుంతియాలు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. తెలంగాణ కోసం ఎందరు పోరాటం చేసిన సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇస్తే నేడు ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని చెప్పారు. సోనియాలేకుంటే ఎన్నటికి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, కేవలం ఇద్దరు ఎంపిలు ఉన్న టిఆర్‌ఎస్ పార్టీతో తెలంగాణ ఎలా సాద్యమయ్యేదని అన్నారు. తెలంగాణ వచ్చిన ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయని, వరంగల్ శృతి ఎన్‌కౌంటర్‌కు కేసిఆర్ సిగ్గుపడాలని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు బాదాకరమని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదన్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో ఆందోళన బాట పట్టారని అన్నారు.తెలంగాణ బాగుపడుతుందనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప కేసిఆర్‌ను చూసి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేందుకు నూతన తెలంగాణను నిర్మించుకునేందుకు కేసిఆర్ కళ్లు తెరిచేలా వరంగల్ ఉప ఎన్నిక గుణపాఠం కావాలని సూచించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ్యులు వి. హన్మంతరావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపి మదుయాష్కి, మాజీ ప్రభుత్వ చీప్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దోపిడీ దొంగల ముఠా పరిపాలిస్తున్నదని, కేసిఆర్ మేక తోలు కప్పుకున్న పులిలాంటివాడని విమర్శలు గుంపించారు. ఆహంకారంతో పాలన కొనసాగిస్తూ రైతులు ఆత్మహత్యలు ఇతర సమస్యలపై ప్రతిపక్షాలను విమర్శిస్తూ దాటవేస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించేలా వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిపించి సోనియాగాందీకి కానుకగా ఇవ్వాలని కోరారు. మరోసారి మోసపోకుండా విబేధాలను పక్కకు పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, జి.విజయరామారావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, డిసిసిబి ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొండేటిశ్రీధర్, బి. ఆరోగ్యం, నాయకులు సాంబారి సమ్మరావు, హరిరమాదేవి, రాజారపు ప్రతాప్, మంద వినోద్,ఇనుగాల వెంకట్రాంరెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, ప్రభాకర్‌రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. త్వరలో జరుగనున్న ఎంపీ ఉప ఎన్నికకు ఎఐసిసి, పిసిసి నాయకులు కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.





