ఇన్సూరెన్స్‌ పైసలు ఇప్పిస్తవా..?

– పార్టీ అధ్యక్షుడివా.. ఇన్సురెన్స్‌ ఏజెంటువా

– బండి సంజయ్‌పై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,నవంబరు 29(జనంసాక్షి):ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం రూపాయి అయినా ఇచ్చిందా అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తాము డ్రైనేజీలు, రోడ్లు నిర్మిస్తామని, సంస్థలను నగరానికి తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటుంటే.. వాళ్లు ఇది కూలగొడతాం.. అది కూలగొడతాం అంటున్నారని భాజపా, ఎంఐఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ శాంతినగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు లేవన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు. దిల్లీ నుంచి 15 మంది వరకు భాజపా నేతలు, కేంద్రమంత్రులు వచ్చినా.. సింహం సింగిల్‌గానే వస్తోందని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. అమరావతికి తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని.. హైదరాబాద్‌కు అదీలేదని ఎద్దేవా చేశారు.

ఐటీఐఆర్‌ను రద్దు చేసింది విూ ప్రభుత్వం కాదా?

నగరానికి రూపాయి ఇవ్వకపోగా రుబాబు చేస్తున్నారని భాజపా నేతలను కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేస్తామంటూ కేంద్ర¬ంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యూపీఏ హయాంలో నగరానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రద్దు చేసిన విూరే ఐటీ హబ్‌గా మారుస్తామంటే ఇక్కడ నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వరదల్లో ద్విచక్ర వాహనాలు పాడైతే ఇన్స్యూరెన్స్‌ పరిహారం ఇప్పిస్తామంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ విూడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఇన్సూరెన్స్‌ పరిహారాన్ని ఆయా సంస్థలే ఇస్తాయని.. విూరిచ్చేదేంటని ప్రశ్నించారు. ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌వా? పార్టీ ప్రెసిడెంట్‌వా? అంటూ పరోక్షంగా సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై చేసేవాటని సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటారని.. హైదరాబాద్‌ శత్రుదేశంలా కనిపిస్తోందా?అని ప్రశ్నించారు. ఎక్కడ మత ఘర్షణలు జరిగాయని అమిత్‌షా ప్రశ్నిస్తున్నారని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో దిల్లీలో జరగలేదా? అని నిలదీశారు.