ప్రజ్ఞ సింగ్‌కు టిక్కెట్ పై మండిపడ్డ ఓవైసీ
ఔరంగాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): నెలరోజుల్లో ప్రధాని మోడీ మాజీ కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి జోస్యం చెప్పారు. ప్రధాని మాటలకు, చేతలకు సంబందం లేదని అసదుద్దీన్ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రతపై మాట్లాడే ఆయన, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులైన వారికి పార్టీ టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపణలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఒవైసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై నిప్పులు కురిపించాడు. ఉగ్రవాదం నిరోధం గురించి మాట్లాడుతున్న మోడీ మాలేగావ్ పేలుళ్ల ఘటనలో 6 గురు ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు బిజెపి టికెట్టు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మోడీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. మోడీ చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. తమకు బలమున్నప్రాంతాల్లో పోటీ చేస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
ఉగ్రదాడి నిందితులకు టిక్కెట్టా




