Tuesday, 3 November 2026

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

000చిన్నమునగాల(కొణిజర్ల) : ‘బతకాలంటే ఇంత కష్టపడాలా.. నేను ఊహించుకున్న కలలన్నీ కల్లల య్యాయి. ఏదో సాధిద్దామనుకున్నాను..  అన్నింట్లో పరాజయం పాల య్యాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక నేను బతికేందుకు అర్హుడను కాను.. ఏడుస్తూ పుట్టిన నేను ఏడుస్తూ బతకలేను.. అందుకే చచ్చి పోతున్నా’ అని ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి పెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చిన్నమునగాలలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై పి .కరుణాకర్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన పాపగంటి వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతుల పెద్ద కుమారుడు రాధాకృష్ణ(24) ఇంజనీరింగ్(బీటెక్-ఈఈఈ) పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.

ఈ క్రమంలో గత మూడేళ్లగా ఖాళీగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు కూలి చేసి ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. దీంతో కొద్దిపాటి ఆర్థిక సమస్యలు కూడా తలెత్తాయి. ఉద్యోగం లేదని రాధాకృష్ణ  మానసికంగా కుంగిపోసాగాడు. మిత్రులతో కూడా ఎప్పుడూ తాను బతకడం వృథా అని ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో గురువారం తె ల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున పనులు చేసేందుకు తల్లి వెంకటరమణ గదిలోకి వెళ్లి చూసి గట్టిగా అరిచి రోదిస్తుండటంతో తండ్రి , చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించారు. అప్పటికే రాధాకృష్ణ మృతిచెంది ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *