Wednesday, 4 November 2026

ఉద్యోగ హావిూల అమలులో ప్రభుత్వాల విఫలం: డివైఎఫ్‌ఐ

 

కడప,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిరుద్యోగులను మోసంచేసి, వారి జీవితాల్లో చీకటిని నింపాయని డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి శేఖర్‌ విమర్శించారు. రెండు ప్రభుత్వాలు నిరుద్యోగుల కు చేసింది శూన్యం అన్నారు. మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, చంద్రబాబు ఇంటికో ఉద్యోగము ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, తిరిగి ఎన్నికలు వస్తున్నా ఈరెండు ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. డివైఎఫ్‌ఐ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మైదుకురులో బద్వేల్‌ రోడ్డులో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి శేఖర్‌ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై మరో స్వాతంత్య తరహా ఉద్యమం తప్పదన్నారు. 1980 నవంబర్‌ 3న పంజాబ్‌ రాష్ట్రంలోని హర్యానాలో భారతప్రజాతంత్ర యువజ సమాఖ్య ( డివైఎఫ్‌ఐ ) ఏర్పటైంది. విద్యా, ఉపాధి లక్ష్యంతో నిరంతరం నిరుద్యోగ సమస్యలపై డివైఎఫ్‌ఐ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తక్షణం వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం యువత నా ఉద్యోగం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో కుమార్‌, రాజశేఖర్‌, ఇమామ్‌, ప్రశాంత్‌, రంగయ్య, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.