– ప్రతి ఎన్నికలకు కొత్తభాగస్వామిని ఎన్నుకోవటం బాబునైజం
– బాబు స్వార్థ రాజకీయాలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు
– వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదు
– ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ, నవంబర్3(జనంసాక్షి) : ఊసరవెల్లికూడా సిగ్గుపడేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని, బాబుకంటే అవకాశవాద నేత మరొకరు ఉండరని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని సవాలు విసిరిన బాబు ఎన్నికల్లో ఓడిపోయాక కాళ్లు పట్టుకుని ఆయన పంచన చేరారని దుయ్యబట్టారు. కర్షక పరిషత్ వ్యవహారంలో కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన మారలేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ టీడీపీని చీలుస్తాననీ, సాయం చేయాలని అప్పట్లో చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరారనీ, అయితే దాన్ని సున్నితంగా వైఎస్ తిరస్కరించారని కన్నా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ జాతీయ విూడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ బయటపెట్టారని వెల్లడించారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని, కాంగ్రెస్
పార్టీని ప్రజలు తిరస్కరించారని వైఎస్ చెప్పినట్లు కన్నా గుర్తుచేసుకున్నారు. ఈ కుట్ర 1996లో వైస్రాయ్ ఘటనతో పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ ను చంపేశాక ఇప్పుడు చంద్రబాబు ఆయనకు రోజూ దండ వేస్తున్నారని విమర్శించారు. ప్రతీ ఎన్నికలకు కొత్త భాగస్వామిని ఎన్నుకోవడం చంద్రబాబు నైజమని ఎద్దేవా చేశారు. 2019లో మోదీని ప్రధాని చేసేవరకూ నిద్రపోనని చంద్రబాబు ఎన్డీయే కూటమిలో తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. సోనియా ఇటలీ దయ్యం, ఆమెను తరిమేయాలి, కాంగ్రెస్ వల్లే దేశం నాశనమైంది అంటూ బాబు చెప్పారన్నారు. ఇలా చొక్కాలు మార్చినట్లు మాటలు మార్చడంలో చంద్రబాబు ఉద్ధండుడని దుయ్యబట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కలయికను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. చంద్రబాబు పాపాలను తాము ఎలా మేయాలంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని, ఇలాంటి వ్యక్తినా మేము సీఎంగా ఎన్నుకున్నది అని మదనపడుతున్నారని లక్ష్మయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా.. చంద్రబాబు రాజకీయాలు




