Wednesday, 4 November 2026

బాబుతో పొత్తు కంటే..  దౌర్భాగ్యం మరొకటి లేదు

– ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఎలా చెప్పాలి
– బాబుచేసిన పాపాల భారాన్ని మేం మోయలేం
– పొత్తుపై కనీసం మమ్మల్ని సంప్రదించలేదు
– ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగలేను
– అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నా
– కాంగ్రెస్‌ నేత సి.రామచంద్రయ్య
కడప, నవంబర్‌3(జ‌నంసాక్షి) : ఏపీ విభజన తర్వాత సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌ నేతలను తిట్టని రోజు లేదని, అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవటం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. విభజన హావిూల కింద రూ.2 లక్షల కోట్లు రావాల్సి ఉన్నా వాటిని సాధించుకోవడంలో చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. విభజన హావిూల విషయంలో రాష్ట్ర ప్రజలకు బాబు అబద్ధాలు చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీలో తాను కొనసాగలేనని అందుకే బయటకు వెళ్లిపోతున్నానని స్పష్టం చేశారు. టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తుపై పీసీసీకి కనీస సమాచారం ఇవ్వలేదనీ, సీనియర్‌ నాయకులను సైతం సంప్రదించలేదని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, జెండాలు చూపి అవమానించిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిద్ధాంతం, విలువలు అన్నవి లేవనీ, ఆయన ఎవరితోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన పాపాల భారాన్ని తాము మోయలేమని స్పష్టం చేశారు. ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఎలా చెప్పాలని నిలదీశారు. పొత్తుపై రాహుల్‌ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. పొత్తుతో రాజకీయంగా ఫలితం ఉంటుందో లేదో తెలియదని.. కానీ తాము నైతికంగా పతనమయ్యామన్నారు. కాంగ్రెస్‌ను మోసం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం దారుణమని సి.రామచంద్రయ్య మండిపడ్డారు. కాగా, టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తును నిరసిస్తూ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.