ఎన్నికల విధులకు వెళ్లే వారురక్షణ చర్యలు తీసుకోవాలి
ద్రవపదార్థాలను ఎక్కువగా సేవించాలి
పెరుగుతున్న ఎండలపై వైద్యుల ఆందోళన
హైదరాబాద్,మే3(జనంసాక్షి): ఎండాకాలంలో తప్పనిసరిగా ప్రయాణించేవారు ఎండ నుంచి రక్షణకు జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఉదయం, సాయంత్రంపూటమాత్రమే ప్రయాణాలు పెట్టుకోవాలన్నారు. ప్రధానంగా చిన్న పిల్లలను ఎండతో తిరగనీయవద్దని హెచ్చరించారు. పిల్లలకు తరచూగా నీటిని తాగించాలని అన్నారు. అన్నివయసులవారు కూడా మజ్జిగ, కొబ్బరిబొండాలు, నిమ్మరసం, ఇతర పళ్లరసాల వంటి ద్రవహారాలను ఎక్కువగా తీసుకోవాలి. చెమటను పీల్చుకునే కాటన్ దుస్తులనే ధరించాలి. ప్రస్తుత ఎన్నికల సమయంలో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు, ప్రచారం చేసే అభ్యర్థులు, పార్టీల నేతలు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో ఎండల్లో తిరిగేవారికి నేరుగా వడదెబ్బ ప్రమాదముండగా నీడపట్టునున్నా శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశముంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, శరీరం వేడిగా ఉండటం తదితర లక్షణాలు కనిపించినా వడదెబ్బగా భావించి చల్లని గుడ్డతో బాధితుల శరీరాన్ని తుడవాలి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ థెరపీద్వారా కొలుకునే అవకాశముంది. ఎండలో తిరగకుండా ఉండటమే మంచిదికాగా తప్పనిసరిగా వెళ్లేవారు ఎండనుంచి రక్షణకుగాను జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఎండతీవ్రతతో జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో కావడం భానుడి భగభగలను తెలియచేస్తోంది. రాత్రీపగలు తేడాలేకుండా వేడిమి వాతావరణం అలుముకుని జనం విలవిల్లాడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను ప్రభావంవల్ల సముద్రం నుంచి చల్లగాలులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలవైపు వీస్తుండగా అక్కడి వేడిగాలులు తెలంగాణ వైపు ముఖ్యంగా ఉత్తర తెలంగాణవైపు వస్తున్నాయి. దీంతోపాటుగా ఉత్తర భారతం నుంచి వడగాలులు దక్షిణభారతం వైపు వీస్తుండటంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత చాలా హెచ్చింది. తెలంగాణ జిల్లాల్లో 9 కి.విూ ఎత్తులోపు అల్పపీడన ద్రోణి కొనసాగటం, కొన్నిప్రాంతాల్లో మబ్బుల్లేక ఎండ నేరుగా భూమిపై పడటంతో వేడి క్రమంగా పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా గంటకు 11 కి.విూ వేగంతో వేడిగాలులు వీస్తుండటంతో శరీరం త్వరితంగా వడదెబ్బకు గురవుతుంది. వాహనాలపై ప్రయాణించేవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఉపాధి హావిూ కూలీలు, పొలం పనులకు వెళ్లే రైతులు, ధాన్యం కేంద్రాలు, మార్కెట్‌యార్డులు, రహదారులపై విక్రయాలు సాగించేవారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు, పగటిపూట తిరిగేవారిలో చాలామంది ఎండదెబ్బకు గురవుతారు. మరికొన్ని రోజులపాటు ఇదేరీతిన ఉష్ణోగ్రతలు నెలకొనటం, వడగాలులు వీసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటుండటంతో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
ఎండల నుంచి రక్షణ పొందండి




