కోర్టుకు వెళ్లాలని ఎపి సర్కారు నిర్ణయ
హైదరాబాద్,జనవరి3 (జనంసాక్షి): ఎంసెట్‌పై ప్రతిష్ఠంభన ఇంకా వీడలేదు. ఈ వివాదాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని ఎపి సర్కారు నానా తంటాలు పడుతోంది. ఎంసెట్ వివాదాన్ని ఎపి సర్కార్ కోర్టు ముందుకు తీసుకు వెళ్లాలని చూస్తోంది. ఎంసెట్‌పై ఎపి సర్కార్ హడావిడిగా తేదీలు ప్రకటించి, చివరికి కోర్టు ముందుకు వెళ్లనున్నది. తేదీలపై మండిపడ్డ తెలంగాణ సర్కార్ గవర్నర్ నరసింహన్‌కు వివరణ ఇచ్చి చివరకు తామే ఎంసెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోవాలని ఎపి చూస్తోంది. ఇదిలావుంటే ఆంధప్రదేశ్ హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు, అధికారం తమకే ఉన్నందున తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పి ఎంసెట్ నిర్వహించే అవకాశాన్ని తమకే కల్పించాలని ఆయన ఈ భేటీలో గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఒకవేళ గవర్నర్ గనక ఈ అంశంపై ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించని పక్షంలో ఇక కోర్టు మెట్లు ఎక్కడం తప్ప మరో మార్గం లేదని కూడా గంటా గవర్నర్‌కు స్పష్టం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ ఉద్దేశంతోనే గంటా గవర్నర్‌ను కలుసుకున్నట్టు తెలుస్తున్నది. షెడ్యూలు పది ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికే ఎంసెట్ నిర్వహించే అధికారం ఉన్నట్టు భావిస్తున్న ఆంధప్రదేశ్ అధికార యంత్రాంగం ఇప్పటికే ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే అది తొందరపాటు చర్య అని, విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తమకే ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇటీవల పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. మంత్రి గంటా ఇటీవల కలిసినపడు కూడా గవర్నర్‌ను కలిసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్లు కలిసే ఉంటాం కాబట్టి ఎంసెట్ నిర్వహణ అవకాశం తమకే కల్పించాలని కోరారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సైతం గవర్నర్ నరసింహన్‌ను కలిసినపుడు ఎంసెట్ నిర్వహించుకునే అవకాశాన్ని తమకే ఇవ్వాలని కోరినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంసెట్ పంచాయతీని గవర్నర్ గనక పరిష్కరించలేకపోతే సుప్రీం కోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్లాలన్నది ఆంధప్రదేశ్ ఆలోచనగా కనిపిస్తున్నది. తెలంగాణ కల నెరవేరిన తర్వాత కూడా ఎంసెట్‌ను ఆంధప్రదేశ్ నిర్వహించడం ఏమిటన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రశ్న. మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం, కావాలంటే విూకు కూడా నిర్వహించిపెడతామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ చెబుతున్నది. అయితే ఈ పరిస్థితులలో గవర్నర్ ఏమి సూచిస్తారన్నది ఆసక్తిగా మారింది.శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి కలసి… ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని గవర్నర్‌కు తెలియజేసినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నిబంధనల ప్రకారం 15 శాతం ఓపెన్ కోటాలో పదేళ్లపాటు ఏపీ విద్యార్థులకు అవకాశం ఇస్తామని, ఇందుకోసం ప్రవేశాల కమిటీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని సభ్యుడిగా చేర్చేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు గవర్నర్‌కు వివరించానని తెలిపారు. దీనిపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సెట్స్ తేదీలను ప్రకటించి ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యా మండలి తప్పు చేశాయని పేర్కొన్నారు. ఈ విషయం కూడా గవర్నర్ దృష్టికి వెళ్లిందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు లేకుండా, సాఫీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించారని… తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి పొరపాటు జరగదని ఆయనకు వివరించానని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ ప్రవేశాల్లో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు అమలవుతున్న ప్రవేశాల విధానాన్ని కొనసాగిస్తామని తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33లోనే చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఇందుకోసం ఏపీ విద్యార్థులు తెలంగాణ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ పరీక్షలకు తాము ఏపీలో కేంద్రాలు ఏర్పాటు చేయబోమని.. తమిళనాడు, కర్ణాటక రాష్టాల్రకు మన విద్యార్థులు వెళ్లి రాస్తున్న తరహాలో ఏపీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఏపీ కూడా అక్కడి విద్యా సంస్థల్లోని ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇంటర్ బోర్డు కూడా తెలంగాణదేనని, ఏపీలోనూ మేం పరీక్షలను నిర్వహిస్తామని చెప్పినా వినకుండా… వారు ముందే షెడ్యూల్ విడుదల చేసుకున్నారని పేర్కొన్నారు.60 ఏళ్లుగా ఏ చట్టాలను లెక్క చేయకుండా, చేసిన చట్టాలు, జీవోలను అమలుచేయని అలవాటు వారిదని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా తెలంగాణ ఏర్పాటయిందన్న విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణను వారు గుర్తించాల్సిన అవసరం లేదని, కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని స్పష్టం చేశారు. దీంతో ఇది నచ్చని ఎపి సర్కార్ కోర్టులో తేల్చుకోవాలని చూస్తోంది.





