Monday, 2 November 2026

సకల శాస్త్ర సాంకేతిక రంగాలు మానవ వికాసానికి దోహదం చేయాలి

5

– సైన్సుకాంగ్రెస్‌ లో ప్రధాని నరేంద్రమోడీ

ముంబై,జనవరి3(జనంసాక్షి): మానవ వికాసానికి దోహదం చేసే అన్ని రంగాలలోనూ భారతదేశాన్ని ముందు వరుసలో నిలపడంలో భారత శాస్త్రవేత్తల కృషి అనన్యసామాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత దేశాభివృద్ధి శాస్త్ర సాంకేతిక వికాసం పైనే ఆధారపడి ఉన్నదని ఆయన పునరుద్ఘాటించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇటీవల కాలంలో భారతదేశం ఉరకలు పరుగులు తీస్తున్నదని, భారత్‌ ఇంకా ఏయే విజయాలు సాధిస్తుందోనన్న ఆసక్తి ప్రపంచమంతటా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ప్రపంచం మన గురించి వేస్తున్న అంచనాలు వాస్తవరూపం దాల్చడానికి ఇటువంటి సైన్స్‌ సదస్సులు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన అన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో శనివారంనాడు 102వ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తూ దేశాభివృద్ధిని బహుముఖాలుగా విస్తరించాలనే లక్ష్యంతోనే భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆనాడు సైన్స్‌ కాంగ్రెస్‌కు అంకురార్పణ చేశారని ప్రధాని మోడీ  గుర్తు చేశారు. సైన్స్‌ ప్రజల అవసరాలను వీలైనంత ఎక్కువగా, వీలైనంత తక్కువ శ్రమతో తీర్చగలగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా దారిద్య నిర్మూలనలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర అద్వితీయమని ఆయన శ్లాఘించారు. సైన్స్‌ను మానవ మేధస్సు ముందుకు తీసుకుపోతుండవచ్చు కాని ఆ ప్రగతికి మూల కారణం మనిషి జిజ్ఞాసేనని ఆయన అన్నారు. ఏదో తెలుసుకోవాలి, ఏదో సాధించాలన్న మనిషి తపనే శాస్త్ర సాంకేతిక వికాసానికి దోహదంచేస్తున్నదని ఆయన అన్నారు. భారత్‌ పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశ, మానవాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉందన్నారు. మన శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే మంగళయాన్‌ను  కక్ష్యలో ప్రవేశపెట్టారని ఆయన ప్రశంసించారు. మంగళయాన్‌ మన శాస్త్రవేత్తల జ్ఞానానికి నిదర్శనమన్నారు. శాస్త్ర, సాంకేతికతతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. వ్యర్థాలను డబ్బు ఉత్పత్తి కేంద్రాలుగా మలచాలని మోదీ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉందని ఆయన ఉద్ఘాటించారు. చైనాలో అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత సమానస్థాయిలో అభివృద్ధి చెందాయని మోదీ పేర్కొన్నారు.మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర రావు, ముఖ్యమంత్రి ఫద్నవీస్‌, కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *