ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన కేటీఆర్
మేడ్చల్ : ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
మౌలిక వసతులతోనే అభివృద్ధి సాధ్యం : కేటీఆర్
మౌలిక వసతులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు కేటీఆర్. ఓఆర్‌ఆర్ చుట్టూ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఎస్‌ఆర్‌డీపీ కింద అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు.