Tuesday, 3 November 2026

ఎడవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్‌ నారాయణ

ncu1vcyuనల్గొండ :దశాబ్దాల పాటు ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి పట్టి పీడించింది. గుక్క నీటిలో గంపెడంత గరళాన్ని నింపి అమాయకుల జీవితాలను కబళించింది. లక్ష్యం వైపు కదం తొక్కాల్సిన జీవితాలను చిందరవందర చేసి, బంగారు భవిష్యత్‌ను సొంతం చేసుకోవాల్సిన అడుగులను వంకర టింకర చేసింది. కానీ ఓ సంకల్పం ఆ దుస్ధితిని పారద్రోలింది. ఓ సమున్నత ఆశయం ముసురుకున్న చీకట్లను పారద్రోలి వెలుగులు నింపింది.కొన్నేళ్ల క్రితం వరకు నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలంలోని మాద ఎడవల్లి గ్రామం దుస్ధితి ఇది. దశాబ్దాల కాలం పాటు మాద ఎడవల్లి గ్రామాన్ని ఫ్లోరైడ్ మహమ్మారి తన రాకాసి కోరల్లో బంధించింది. ఏ నీటి బొట్టును వదలకుండా విషాన్ని నింపి, వికట్టాటహాసం చేసింది. గత్యంతరం లేని ప్రజలు ఫ్లోరైడ్ నీటినే తాగి వ్యాధుల బారిన పడ్డారు. వంగిపోయిన నడుములతో, వంకర్లు పోయిన కాళ్లతో అటు చావలేక ఇటు బతకలేని స్ధితి చేరుకుని ఊహాకు సైతం అందని నరకయాతన అనుభవించారు, మాటలకు అందని యాతనను భరించారు.ఎడవల్లి గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి ఎంతగా బాధించింది అంటే ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు సైతం ఇక్కడికి వచ్చారు. ఫ్లోరైడ్ మహమ్మారి ఆకృత్యాలను చూసి, ఎడవల్లి గ్రామస్ధుల యమయాతనను చూసి చలించిపోయారు. టన్నుల కొద్ది సానుభూతిని, జాలిని కురిపించిన వారెవ్వరూ ఇసుమంత కూడా సహాయం చేయలేకపోయారు. కానీ ఒక్కడు మాత్రం ఎలాగైనా ఎడవల్లి ఎదపైన ఫ్లోరైడ్ చేసిన గాయాన్ని మాన్పాలనుకున్నాడు. ఆయనే డాక్టర్‌ ఎ.ఎఎస్ నారాయణ. అనుకున్నదే తడవు అనుమానాలను పటాపంచలు చేస్తూ, అవమానాలను పక్కకు నెట్టేస్తూ ఎడవల్లిని దత్తత తీసుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌. నారాయణ కొన్నేళ్ల క్రితం బంధువులను కలుసుకునేందుకు ఎడవల్లి గ్రామానికి వచ్చారు. జీవచ్ఛవాల్లాంటి గ్రామస్ధుల దీనస్ధితి నారాయణ హృదయాన్ని మెలితిప్పింది. ఎడవల్లి వేదనకు అంతం పలకాలని నిశ్చయించుకుని కార్యాచరణ ప్రారంభించారు. స్నేహితుల సాయంతో పరిస్ధితిలో మార్పు తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే NGOల నమ్మక ద్రోహంతో విసిగిపోయిన ఎడవల్లి గ్రామస్ధులు డాక్టర్‌ నారాయణకు అంతగా సహకరించలేదు. ప్రతికూల పరిస్ధితులు సవాల్ విసురుతున్నా మొక్కవోని దీక్ష సంకల్పజ్యోతికి అండగా నిలబడింది.ఫ్లోరైడ్‌ పై యుద్ధాన్ని ప్రకటించిన డాక్టర్‌ నారాయణ థాయ్‌లాండ్‌తో పాటు పలు దేశాలు పర్యటించారు. ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొట్టే సూత్రాలు ఒడిసిపట్టిన ఆయన సాయి ఓరల్‌ ఫౌండేషన్‌ను స్ధాపించి ప్రతి ఇంటికి వాటర్‌ ఫిల్టర్ పంపిణీ చేశారు. భూగర్భజలాలు పెరిగితే ఫ్లోరైడ్ భూతం పొలిమేరల్లోకి కూడా రాదనే సత్యాన్ని గ్రామస్ధులకు బోధపడేలా చేశారు. ఇంకుడుగుంతలు తవ్వించి వాన నీటిని ఒడిసిపట్టుకోవటంలో సఫలీకృతమయ్యారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటించి మోడు వారిన ఎడవల్లిలో పచ్చదనాన్ని నింపటంలో విజయం సాధించారు. గ్రామంలో అంతర్గత రహదారుల వ్యవస్ధకు ఓ రూపునిచ్చి, మరుగుదొడ్లు కట్టించారు. మహిళల్లో చైతన్యం నింపితేనే గ్రామంలో సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని భావించి వారికి కుట్టుమిషన్లు ఇప్పించి, వృత్తికళల్లో నైపుణ్యం సాధించేలా చేశారు. అంతే కాదు ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకున్న కొందరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చేయించారుఎడవల్లి గ్రామం డాక్టర్‌ నారాయణకు ఏమి ఇవ్వలేదు. అయినా ఆయన ఎడవల్లికి ఎంతో ఇచ్చారు. సిరి సంపదలు లేకున్నా, సెలబ్రిటి కాకున్నా కల్మషం లేని మనస్సున్న శ్రీమంతుడు డాక్టర్ నారాయణ. అందుకే ఆయన సేవాతత్పరతకు ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు, కదంతొక్కాల్సిన యువతీయువకులు, విశ్రాంతితో సావాసం చేయాల్సిన వయో వృద్ధులు కదల్లేని స్ధితిలో ఉండటమే తనను కదిలించిందని వినమ్రంగా బదులిస్తారు డాక్టర్ నారాయణ. ఊపిరి ఉన్నంత వరకు ఎడవల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్తున్న డాక్టర్ నారాయణ మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *