హైదరాబాద్ : సంక్షేమ హాస్టళ్లకు మంగళం పాడేందుకు… టీ-సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. విద్యార్థుల సంఖ్యను సాకుగా చూసి…పలు వసతి గృహాలను ఎత్తేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే సర్కారు సమాలోచనలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లను మూసివేయొద్దని డిమాండ్ చేస్తున్నాయిసంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వసతులపై సర్కారును ప్రతిపక్షాలు ఇరుకునబెడుతున్నాయి. దీంతో హాస్టళ్లన ప్రక్షాళన చేసేందుకు టీసర్కార్ సిద్ధమైంది. అన్ని హాస్టళ్లను ఒకే గొడుకు కిందకు తేవాలని భావిస్తోంది. అంతేగాక విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే వసతి గృహాలను మూసివేయాలని భావిస్తోంది.తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లన్ని పలు శాఖల కింద పనిచేస్తున్నాయి. వాటి మధ్య ఎక్కడా పొంతన లేకుండాపోయింది. మెనూ నుంచి మొదలుకొని సిలబస్ వరకు అంతా భిన్నంగా ఉంటున్నాయి. దీంతో వాటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు టీసర్కార్ సిద్ధమైంది. శాఖల వారీగా కార్యదర్శులు సంక్షేమ హాస్టళ్ల పనితీరును అధ్యయనం చేస్తున్నారు. హాస్టళ్లలోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న హాస్టళ్లను ఎత్తేసి..వారిని ఇతర హాస్టళ్లకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిబ్బందిని కూడా పక్క హాస్టళ్లకు బదలాయించాలని భావిస్తోంది. తక్కువ సంఖ్యతో హాస్టళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందని అభిప్రాయపడుతోంది.ఆదిలాబాద్ జిల్లాలో 50 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. అందులో 4 వేల 280 మంది విద్యార్థులు ఉండాలి కాని ప్రస్తుతం 3 వేల 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కొన్ని హాస్టళ్లలో నిర్దేశిత సంఖ్యలో సగం మంది కూడా విద్యార్థులు లేరు. బెజ్జూరు, దస్తురాబాద్లోని హాస్టళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పరిస్థితుల్లో ఆయా చోట్ల హాస్టళ్లను నడపటం కంటే… అక్కడి విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించటం ఉత్తమమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను సేకరించాక ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.విద్యార్థుల సంఖ్య సాకుగా చూపి హాస్టళ్లను మూసివేయవద్దని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సరైన మౌళిక వసతులు కల్పిస్తే….నిర్దేశిత సంఖ్యకన్నా ఎక్కువ మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరుతారని సూచిస్తున్నాయి. ప్రభుత్వం హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని మానుకొని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు….




