సూర్యాపేట ఘటనలో కాల్పులకు తెగబడిన దోపిడీ దొంగల ఖేల్ ఖతమైంది. మోత్కూరు మండలం జానకీపురం దగ్గర ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. అయితే దొంగల కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందారు. ఆత్మకూరు-ఎం ఎస్సై మృతిచెందగా.. రామన్నపేట సీఐకి తీవ్రగాయాలయ్యాయి.నల్గొండ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. సూర్యాపేటలో కాల్పులకు తెగబడి పారిపోయిన ఇద్దరు దుండగులు హతమయ్యారు. మోత్కూరు మండలం జానకీపురం దగ్గర ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట ఘటన నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నిందితులకు తప్పించుకునే దార్లన్నీ మూసుకుపోయాయి. రెండురోజులుగా జిల్లాలోనే తలదాడుకున్న దుండగులు ఈ ఉదయం పారిపోవడానికి ప్రయత్నించారు. మొదట అరవపల్లి శివారు దర్గాలో నిందితులున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగానే దుండగులు ఫైరింగ్ కు దిగారు. సీఐ గంగారామ్ పై కాల్పులు చేశారు. సూర్యాపేటలో పోలీసుల నుంచి అపహరించిన కార్బైన్ వెపన్ తో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం గన్ తో బెదిరించి ఓ వ్యక్తి దగ్గర బైక్ ను లాక్కున్నారు. డిస్కవర్ బైక్ నెంబర్ AP 24-7066పై పరారయ్యారు. సీతారాంపురం నుంచి చిర్రగూడురు, కోటమర్తి బిక్కేరువాగు మీదుగా పారిపోయారు. దీంతో పోలీసులు దొంగలను ఛేజ్ చేశారు. వారికి తప్పించుకునే అవకాశం లేకుండా అన్ని వైపులా నుంచి దిగ్బంధించారు. స్థానిక పోలీసుల సమాచారంతో గ్రే హౌండ్స్ బలగాలు, ప్రత్యేక కమాండోలు కూడా రంగంలోకి దిగారు.
మోత్కూరు మండలం జానకీపురంలోకి చొరబడే ప్రయత్నం చేశారు దుండగులు. దీంతో పోలీసులు గ్రామస్తుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. నిందితులను చుట్టుముట్టారు. వేట తీవ్రం కావడంతో దోపిడీదొంగలు మరోసారి కాల్పులకు దిగారు. దుండగులు, పోలీసులకు మధ్య హోరాహోరీగా జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు దొంగలు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఓ కార్బైన్ వెపన్, రెండు పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇద్దరు దుండగులను యూపీకి చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బదరుల్ గా గుర్తించారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందాడు. ఆత్మకూరు-ఎం ఎస్సై సిద్ధయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రొబెషనరీ పీరియడ్ లో ఉన్న సిద్ధయ్య స్వస్థలం మహబూబ్ నగర్. ఈ ఘటనలో రామన్న పేట సీఐ బాలనాగిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఈయనకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. డీజీపీ అనురాగ్ శర్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
మొన్న సూర్యాపేట ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని దుండగులు పొట్టనబెట్టుకున్నారు. ఇవాళ మరోసారి మరో కానిస్టేబుల్, ఎస్సై ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. మొత్తానికి విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. ఇద్దరు దుండగులను మట్టుబెట్టారు.




