– డిసెంబరు 9న బాలికలకు ఉపకార వేతనాల కోసం పరీక్ష
– ఎంపికైన వారికి రెండేళ్లపాటు నెలకు రూ.5వేలు చొప్పున సాయం
– కూకట్‌పల్లిలో సుహాసిని విజయం ఖాయం
– నేను ప్రచారంలో పాల్గొనడం లేదు
– ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
హైదరాబాద్, నవంబర్28(జనంసాక్షి) : సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు ఎన్టీఆర్ తనయ, సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ట్రస్టు ఆధ్వర్యంలో 12లక్షల మందికి ఉచితంగా వైద్యసేవలు అందించినట్లు వివరించారు. డిసెంబరు 9న ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల ఉపకార వేతనం కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలో విజయం సాధించిన బాలికలు ఒక్కొక్కరికీ నెలకు రూ.5వేలు చొప్పున రెండేళ్ల పాటు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్ బాలికలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతోనే ‘జస్ట్ టెస్ట్’ అని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ రెండేళ్ళ కాలానికి స్కాలర్ షిప్ ఇస్తామని చెప్పారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌కు రెడ్ క్రాస్ అవార్డ్ రావటం సంతోషకరమన్నారు. ఉచితంగా వైద్య శిబిరాలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్యానికి ఎన్టీఆర్ ట్రస్ట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని భువనేశ్వరి పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా 4,500 మంది అనాథలకు విద్య అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలందించామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులకు ట్రస్ట్ ద్వారా సేవలు అందజేశామన్నారు. పేద విద్యార్థులకు విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. కూకట్‌పల్లిలో మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగడంపై నారా భువనేశ్వరి స్పందించారు. తన కోడలు సుహాసిని గెలుపుపై పూర్తివిశ్వాసం ఉందన్నారు. అయితే సుహాసిని తరపున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిపారు. సుహాసినికి భువనేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. 12లక్షల మందికి వైద్యసేవలందించాం




