Tuesday, 3 November 2026

బాలకృష్ణ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారు


– ఐదు రోజుల పర్యటన
హైదరాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి) : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోలింగ్‌ తేదీ సవిూపిస్తుండడంతో అన్ని పార్టీలు స్టార్‌ క్యాంపెయినర్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి. దీనిలో భాగంగా మహాకూటమి లో భాగంగా బరిలో దిగిన టీడీపీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ నేత, ఏపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో ప్రచారం నిర్వహించిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సారి ఐదు రోజుల పాటు ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన తన అన్నయ్య కూతురు నందమూరి సుహాసిని బరిలోకి దిగిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొననున్న బాలయ్య… వచ్చే నెల (డిసెంబర్‌) 1వ తేదీన శేరిలింగంపల్లి, 2వ తేదీన ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, 3వ తేదీన మహబూబ్‌నగర్‌, మక్తల్‌, 4వ తేదీన రాజేంద్రనగర్‌,
ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, సనత్‌నగర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగిన స్థానాల్లో ముఖ్యంగా ప్రచారంలో బాలయ్య పాల్గోనున్నారు.