Tuesday, 3 November 2026

ఎన్నికలొస్తే బాబు రక్తం మరుగుతుంది

– చంద్రబాబుపై సినీనటుడు నాగబాబు సెటైర్లు
హైదరాబాద్‌, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ‘మై ఛానల్‌, నా ఇష్టం’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన నటుడు నాగబాబు, దీని ద్వారా పొలిటికల్‌ పంచ్‌లు, సెటైర్లు విసురుతోన్న విషయం తెలిసిందే. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ వాగ్బాణాలు సంధిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ సెటైర్‌ వేశారు. ఫిబ్రవరి 1న శాసనసభలో బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే జైలులో పెడతారా? ఊడిగం చేస్తారా? అడిగేవాళ్లు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అంటూ సభలో బీజేపీ ఎమ్మెల్యేలపై బాబు మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై నాగబాబు సెటైరికల్‌ వీడియోను విడుదల చేశారు. అటు చూడండ్రా పాలు మరిగిపోతున్నాయి.. అరే ఇక్కడేదో మాట్లాడుతున్నారు అంటూ శాసనసభలో చంద్రబాబు మండిపడ్డ వీడియోను చూపిస్తూ.. పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది అంటూ విమర్శించారు. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయని, ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది.. థ్యాంక్యూ అని సెటైర్లు
వేశారు. రెండు రోజుల కిందట ఆంధ్రజ్యోతి ఛానల్‌లో లోకేశ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన ఒక కథనం విూద నాగబాబు వ్యంగ్యమైన వీడియో చేశారు. అది కాస్తా వైరల్‌ అయ్యింది. ఎటువంటి వాస్తవాలు లేకపోయినా లోకేష్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆ చానల్‌ ఎలాంటి కథనం చేసిందో వివరించడం నాగబాబు వీడియో లక్ష్యం. కాగా ఇటీవల బాలకృష్ణ, తరువాత వేమూరి రాధాకృష్ణ, నేడు చంద్రబాబును విమర్శించడం ద్వారా టీడీపీపై ఎదురుదాడికి నాగబాబుకు దిగుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా నాగబాబు వీడియోపై పలువురు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు నాగబాబు వ్యాఖ్యలపై ఎదురుదాడి చేస్తున్నారు.