హైకోర్టు తీర్పును ఖాతరు చేయని ప్రభుత్వం
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్
హైదరాబాద్,మే7(జనం సాక్షి): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు వచ్చినా దానిని అమలు చేయకుండా
కోర్టు ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను టీకాంగ్రెస్ నేతలు సోమవారం కలిశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ కోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనన్నారు. శాసన వ్యవస్థలో న్యాయశాఖ జోక్యం చేసుకోవద్దని మంత్రి హరీష్‌రావు అనడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని బహిష్కరించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇదిలావుంటే రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరికి చెందిన స్వాతంత్య సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి సంతాప సభకు ఉత్తమ్ హాజరై మాట్లాడారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కష్టాల్లో ఉన్న కర్షకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్‌ఎస్ సర్కార్ కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఏ కష్టం రాకుండా వారి కళ్లలో సంతోషాన్ని చూడటమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించాలి




