Wednesday, 4 November 2026

మెట్రోలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు

డిమాండ్‌ను బట్టి బోగీ కేటాయిస్తామన్న ఎండి
హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మెట్రోరైలు ఉపయోగ పడుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా మారుతుందని తెలిపారు. మెట్రో స్టేషన్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికుల కోసం ఓ కోచ్‌లో కొంతభాగాన్ని కేటాయించామని చెప్పారు. ఈ మేరకు అవిూర్‌పేటలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  డిమాండ్‌ను బట్టి పూర్తి కోచ్‌ను కేటాయిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా తరుణి పేరిట మధురానగర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మెట్రో రైలుతో నగరంలో కాలుష్యం తగ్గుతుందన్నారు. జులైలో ఎల్బీనగర్‌ – అవిూర్‌పేట్‌, అక్టోబర్‌లో అవిూర్‌పేట్‌ – హైటెక్‌ సిటీ లైన్‌ను పూర్తి చేస్తామన్నారు. 2019లో ఎంజీబీఎస్‌ – జేబీఎస్‌ లైన్లు అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో ఫేజ్‌లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మెట్రోను శంషాబాద్‌ వరకు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మెట్రో మార్గాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని మార్గాలు పూర్తయితే నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గగలదని అన్నారు.
—————-