– ప్రమాణస్వీకారం చేయించిన డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్22(జనంసాక్షి) : శాసనమండలి సభ్యుడిగా జీవన్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ ఛైర్మన్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ గౌడ్, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్‌భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కారెక్కుతారని.. ఆ తర్వాత సీఎల్పీ విలీనం చేస్తారనే చర్చ సాగుతోందని, అయితే, సీఎల్పీని విలీనం చేసే హక్కు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉంటుందన్నారు. లేని అధికారాన్ని కల్పించుకోవటం.. రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని ఆయన మండిపడ్డారు. మరోవైపు రెవెన్యూ ప్రక్షాళన ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఏంచేశావు అంటూ కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి నిలదీశారు. ఓపక్క ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వారికి రావాల్సిన మార్కుట్లో గందరగోళం నెలకొందని అన్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి సీఎం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారు. వెంటనే కేసీఆర్ స్పందించి.. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ప్రమాణం




