చైనా కంపెనీ ప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ
బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ ఏర్పాటుకు సహకరిస్తామని హావిూ
హైదరాబాద్,మే9(జనం సాక్షి): హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్‌ఎంసీలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇలా చేయడం ద్వారా ఇంధనం ఆదాతో పాటు, కాలుష్యానికి చెక్ పెట్టవచ్చన్నారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. నూటికి నూరుశాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. చైనా బయట పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని కూడా చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నగరాలు, పట్టణాల్లో వాహనాలు వెదజల్లే కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమంగా పెంచుతామని, మొదటి దశలోనే 500 వాహనాలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, ఆవశ్యకత ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్టీసీ ఎండి రమణారావు, బి.వై.డి. జనరల్ మేనేజర్ లియూ జూలింగ్,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాంగ్ జీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బి.వై.డి. రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సులో ముఖ్యమంత్రి కొద్దిసేపు ప్రయాణం చేసి పరిశీలించారు. బస్సు నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయని అభినందించారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు, కాలుష్య రహిత వాతావరణానికి ఎంతో అనువుగా ఉన్నాయని సీఎం చెప్పారు. ఒక్కసారి చార్జి చేస్తే 300-400 కిలోవిూటర్ల వరకు వాహనాలు పనిచేస్తాయని, మూడు గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ట్రక్కులు కూడ తాము తయారు చేస్తున్నట్లు బి.వై.డి ప్రతినిధులు వెల్లడించారు.
————
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం




