Tuesday, 3 November 2026

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు-సీఎం కేసీఆర్‌

8

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19(జనంసాక్షి)-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదారాబాద్‌లో నిర్వహించే డిక్కీ ఇండస్ట్రియల్‌ అండ్‌ ట్రేడం ఎక్స్‌పో బ్రోచర్‌ను ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిక్కీ జాతీయ అధ్యక్షుడు మిలింద్‌ కాంబ్లే, సౌత్‌ ఇండియా కో ఆర్డినేటర్‌ రవికుమార్‌, తెలంగాణ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రాహుల్‌ కిరణ్‌ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఇండస్ట్రియల్‌ పాలసీలో పలు అంశాలు పొందుపరచిన విషయాన్ని సీఎం వారికి వివరించారు. ఎస్సీ,ఎస్టీ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వటానికి కూడా నిర్ణయించినట్లు, హైదరాబాద్‌లోని నాస్‌డాక్‌లో మూడు నెలలపాటు వారికి శిక్షణ ఇచ్చి, కొంత పెట్టుబడి కూడా సమకూరుస్తామని వెల్లడించారు. కొన్ని పనులను వారికి రిజర్వు చేసి పెడతామన్నారు. వారిని మంచి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్మ్‌ సిటీ, స్పోర్ట్‌స& సిటీ, ఇండస్ట్రియల్‌ కారిడార్లు తదితర పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు పెట్టే అవకాశం కూడా ఎస్స్‌ీ, ఎస్టీలకు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, పరిశ్రమల కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *