ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత
నెల్లూరు, జూన్7(జనం సాక్షి) : ఏపీలో రోజురోజు చిన్నారులపై లైంగిక దాడులు పెచ్చివిూరిపోతున్నాయి.. రెండుమూడు రోజులకు ఒకటి చొప్పున లైంగిక వేధింపుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ కామాంధుడు ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. గుర్తించిన బాలిక కుటుంబసభ్యులు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. నగరంలోని మినీబైపాస్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్స్ సవిూపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు వాచ్‌మన్ విధులు నిర్వహిస్తూ ఏడేళ్ల పాపతో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం అపార్ట్‌మెంట్ బయట పాప ఆడుకుంటుండగా చెన్నైకు చెందిన సత్తి అలియాస్ సతీష్ మద్యం సేవించి అటుగా వచ్చాడు. ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకున్నాడు. సవిూపంలోని షోరూమ్ మిద్దెపైకి తీసుకెళుతుండగా పాప పెద్దగా కేకలుపెట్టింది. గమనించిన కుటుంబసభ్యులు, బంధువులు అప్రమత్తమై నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. పాపను ఎక్కడికి తీసుకెళుతున్నావని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడికి దేహశుద్దిచేసి దర్గామిట్ట పోలీసులకు అప్పగించారు. నిందితుడు సత్తి కొంతకాలంగా నగరంలో చిత్తుకాగితాలు ఏరుకోగా వచ్చిన నగదుతో మద్యం సేవించడం రాత్రిళ్లు దుకాణాల బయట నిద్రిస్తుంటానని పోలీసులకు తెలిపాడు. సీఐ వి.సుధాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.