– పార్టీ పిరాయింపును ప్రోత్సహించిన బాబా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది?
– బాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– ప్రకాశం జిల్లా బాగుపడాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలి
– వైసీపీ అధికారంలోకి రాగానే వెలిగొండను పూర్తిచేస్తాం
– వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్, నవంబర్3(జనంసాక్షి) : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్తో చంద్రబాబు కలవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని ఉద్దరిస్తానని అంటున్న చంద్రబాబు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం తప్పని తెలిదా అని నిలదీశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నంపై సీఎం అవహేళనగా మాట్లాడారని, ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఈ హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీచేసి గెలవలేదని, రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుని, మళ్లీ ప్రజాస్వామ్యం, దేశం కాపాడటం కోసమని బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు బాగుపడాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు 65 శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీలు 35 శాతం పనులను పూర్తి చేయడానికి నానాకష్టాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటివరకూ ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును నాలుగుసార్లు సందర్శించారనీ, ఆయన ప్రకటనలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు అధర్మపోరాట దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను మార్చేసిన బాబు రూ.270 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనాలను రూ.570 కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. వచ్చే సంక్రాంతికల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని కబుర్లు చెబుతున్నారన్నారు. మరో నాలుగేళ్లు అయినా టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు.
ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్తో.. చంద్రబాబు కలవడం దారుణం




