Wednesday, 4 November 2026

ఏపీలో టీడీపీకి. పొత్తు అవసరం లేదు

– తెలంగాణలో కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలే వస్తాయి
– దేశాన్ని రక్షించేందుకే బాబు రాహుల్‌తో కలిశారు
– ప్రజలు కూడా బాబు నిర్ణయాన్ని ఆమోదించారు
– తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
అమరావతి, నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఏపీలో టీడీపీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మోదీ ఫ్యాక్షనిస్టుగా మారారని, ఏపీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంకోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పారు. మళ్లీ సీఎం కావడానికి రాహుల్‌ ను కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని అన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉన్న బలం చాలన్నారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం ఆరాటపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకే కాంగ్రెస్‌ తో చంద్రబాబు చేతులు కలిపారని చెప్పారు. మహాకూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని అన్నారు. స్వామి ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టు అని, ఆయనతో తనకు రాజీ ఏమిటని జేసీ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై కామెంట్లు చేయడంపై సెటైర్లు వేశారని, రోజా మహాతల్లి… నా విూద ఎందుకు మండి పడుతుందో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రధాని మోడీ పూర్తిగా కక్ష సాధింపుకు దిగుతున్నారని ఆరోపించారు.