Tuesday, 3 November 2026

ఏపీ, టీఎస్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లకు ఐటీ నోటీసులు

19 మద్యం డిపోలకు తాళాలు వేసిన ఐటీ అధికారులు
హై కోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ, టీఎస్‌!

హైదరాబాద్‌, మార్చి 03: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లకు ఐటీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. బకాయి పన్నులు చెల్లించకపోతే మద్యం డిపోలను సీజ్‌ చేస్తామంటూ ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. గడిచిన పదేళ్ల కాలానికి రూ. 9 వేల కోట్లు ఆదాయ పన్నులు చెల్లించాలని, లేదంటే మద్యం డిపోలను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు. అదాయ పన్నుల చెల్లింపులపై రెండు రాష్ర్టాల అబ్కారీ శాఖలు దిగిరాకపోతే మిగిలిన డిపోలకూ తాళం పడే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో 17, ఏపీలో 2 డిపోలను ఐటీ శాఖ సీజ్‌ చేసింది. పన్నుల చెల్లింపులకు గడువు ఇవ్వకుండా ఓ వైపు నోటీసులు జారీ చేస్తూనే.. మరోవైపు మద్యం డిపోలను ఐటీ అధికారులు సీజ్‌ చేస్తున్నారు. దీంతో సోమవారం ఒక్కరోజే అబ్కారీ శాఖకు రూ. 25 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమచారం. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే వైన్‌ మద్యం సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఎదరవుతుంది.

2005 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మద్యం సరఫరా చేసే ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయ పన్ను రూపంలో రూ. 9 వేల కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ వాదిస్తోంది. అయితే ప్రభుత్వం సంస్థగా ఉన్న ఏపీబీసీఎల్‌ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ప్రభుత్వ సంస్థ అయినా వ్యాపారం చేస్తూ ఆదాయం గడిస్తున్నందున పన్ను చెల్లించాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేస్తోంది.

మరోవైపు ఐటీ అధికారులకు, బేవరేజెస్‌ కార్పోరేషన్‌ మద్య ఎలాంటి వివాదాలు ఉన్నాయో బయటపెట్టకుండా మద్యం సరఫరాను నిలిపివేయడం వ్లల వైన్స్‌ షాపు యజమానులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని మద్యం డీలర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వైన్స్‌ షాపులకు మద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలాఉండగా బేవరేజెస్‌ కార్పోరేషన్‌కు ఐటీశాఖ నోటీసులు జారీచేయడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *