ఏపీ టెట్ ఫలితాలు విడుదల
– 57.48శాతం మంది ఉత్తీర్ణత
– వెల్లడించిన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
అమరావతి, జులై2(జనం సాక్షి ) : ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) 2018 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 1న ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 19 వరకు ఆన్లైన్ ద్వారా టెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573మంది హజరయ్యారని.. వారిలో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పేపర్-1లో 69.36 శాతం, పేపర్-2ఏ సోషల్‌లో 45.1 శాతం, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27శాతం, పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు 10,351 పోస్టులతో జూలై 6 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫీకేషన్ ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది. దరఖాస్తుల పక్రియ జులై 7 నుంచి ప్రారంభమైన ఆగస్టు 9 వరకూ సాగుతుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉంచుతారు. రాత పరీక్షను ఆగస్టు 23 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబరు 15 న విడుదల చేస్తామని గతంలోనే ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
టాపర్లు వీరే..
పేపర్ 1 – వేమన కుసుమ, కృష్ణా జిల్లా 146 మార్కులు, పేపర్ 2ఏ సోషల్ స్టడీస్ – ఆర్ల విష్ణుప్రియ, ఒంగోలు, ప్రకాశం జిల్లా 136 మార్కులు, పేపర్ 2ఏ మాథ్స్ అండ్ సైన్స్ – ఇమంది విజయలక్ష్మి, విజయ నగరం 135 మార్కులు, పేపర్ 2ఏ – పాతకోకల బేబీ షాలిని పశ్చిమ గోదావరి, 135 మార్కులు,
పేపర్ 2ఏ తెలుగు – చింతపల్లి లావణ్య, నెల్లూరు, 134 మార్కులు, పేపర్ 2ఏ హిందీ – అచ్చుకుట్ల గౌసియా, కడప, 142 మార్కులు, పేపర్ 2ఏ ఇంగ్లిష్ – ఎం ప్రభాకర్ బాబు, గుంటూరు 138 మార్కులు,
పేపర్ 2బీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ – షేక్ షంషుద్దీన్, కృష్ణా, 135 మార్కులు, పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్ – పాముల వేణుగోపాల్, చిత్తూరు 135 మార్కులు