Tuesday, 3 November 2026

ఏపీ డీజీపీ వివరణ హాస్యాస్పదం

– అక్కడి పోలీసులకు తెలంగాణలో ఏం పని?
– మంత్రులు ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు
– ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు
– టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు
హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో ఏపీ పోలీసులు డబ్బులతో పట్టుబడ్డ వ్యవహారంపై ఆ రాష్ట్ర డీజీపీ వివరణ హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల కమిషన్‌ కు ఏపీ డీజీపీ ఇచ్చిన వివరణపై విూడియాలో వచ్చిన కథనాలు నిజమైతే.. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర సీఈఓ రజత్‌ కుమార్‌ ను గురువారం గట్టు సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. తమ
వీఐపీల రక్షణ కోసమే ఏపీ పోలీసులు తెలంగాణలో తిరుగుతున్నారని ఆ రాష్ట్ర డీజీపీ చెప్పినట్టు వచ్చిన వివరణను తప్పుపట్టారు. ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా తెలంగాణలో భద్రత కల్పించాల్సింది ఇక్కడి పోలీసులేనని స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు వచ్చినా తెలంగాణ పోలీసుల అనుమతితోనే ఏ పనైనా చేయాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల నివాసాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతల చేసిన ఫిర్యాదుపై ఈసీ సీఈఓ ఇచ్చిన నోటీసుకు అడిషనల్‌ సీఈఓ కు వివరణ ఇచ్చామని గట్టు రామచంద్రరావు చెప్పారు. ఎక్కడ దుర్వినియోగం చేశామో చెప్పలేదన్నారు. ఎక్కడా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం లేదని, ప్రభుత్వ కార్యాలయాలు దుర్వినియోగం చెయ్యటం లేదని స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమ మంత్రుల అధికారిక నివాసాలలో పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఐతే, ఆంధప్రదేశ్‌ కు చెందిన మంత్రులకు హైదరాబాద్‌ లో కేటాయించిన నివాసాలలో టీడీపీకి చెందిన వారు ఉండి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని తాము సీఈఓ కు ఫిర్యాదు చేశామని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని రామచంద్రరావు వెల్లడించారు. ఈసీ సీఈఓను కలిసిన వారిలో గట్టు రామచంద్రరావుతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు దండె విఠల్‌, ఉపేందర్‌ ఉన్నారు.