– అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తింపు
– ఆస్తులన్నీ నా కొడుకుకు సంబంధించినవే
– ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటా – చీఫ్ ఇంజనీర్ సురేశ్
హైదరాబాద్, జులై6(జనం సాక్షి) : అవినీతి నిరోధక శాఖ వలకు మరో అవినీతి అధికారి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై నీటిపారుదల శాఖ కృష్ణాబేసిన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ ఇంట్లో అనిశా అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. సోమాజిగూడలోని తన నివాసంతో పాటు కూకట్‌పల్లి, ముసారాంబాగ్, మెట్టుగూడ, ఎర్రమంజిల్, కరీంనగర్‌లోని సురేశ్ స్వగృహంతో పాటు ప్రొద్దుటూరులోని బంధువుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 4చోట్ల, కరీంనగర్‌లోని సురేశ్ స్వగృహంలో, కడప జిల్లా ప్రొద్దుటూరులోని బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌లో రెండు ప్లాట్లు, పది ఇళ్ల స్థలాలు, రెండు ఇళ్లను గుర్తించారు. రూ. 18 లక్షల ఎఫ్‌డీలు, కరీంనగర్‌లో 4 బ్యాంకు లాకర్లు, విలువైన బంగారు ఆభరణాలు, నగదును అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకు లాకర్స్ తెరవాల్సి ఉందన్నారు.
ఆస్తులన్నీ నా కొడుకుకు సంబంధించినవి – సురేశ్ కుమార్
ఆస్తులన్నీ తన కుమారుడికి సంబంధించినవి అని చీఫ్ ఇంజినీర్ సురేశ్ కుమార్ తెలిపారు. తన కుమారుడు, కోడలు అమెరికాలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐగా తన కుమారుడు సంపాదించిన ఆస్తులు ఇవి అని సురేశ్ స్పష్టం చేశారు. నాలుగు లాకర్స్‌లో ఒకటి తనది, మరొకటి తన భార్యది అని పేర్కొన్నారు. మిగతా రెండు కుమారుడు, కోడలివి అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఓ ఇల్లు మాత్రమే కొన్నాను అని స్పష్టం చేశారు. ఆఫీస్‌కు దగ్గరగా ఉంటుందనే సోమాజిగూడలో ఉంటున్నానని తెలిపారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్ మొత్తం రెంట్‌కు తీసుకువచ్చిందే అని సురేశ్ తెలిపారు. తనపై ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చీఫ్ ఇంజినీర్ పేర్కొన్నారు.
ఏసీబీకి చిక్కిన చీఫ్ ఇంజినీర్




