తెలంగాణ రైతుబంధుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న వ్యవసాయశాఖ కార్యదర్శి
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): తెలంగాణకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. రైతుబంధు, రైతు బీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి వినూత్న గుర్తింపు ఇచ్చింది. యూఎన్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.. ఈ రెండు పథకాలను సక్సెస్ పథకాలుగా గుర్తించింది. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి విభాగమైన ఎఫ్ఏఓ.. ఈ నెల 21వ తేదీ నుంచి రోమ్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. ఆ సదస్సులో వివిధ దేశాల్లో
విజయవంతమైన 20 వినూత్న వ్యవసాయ పథకాలను ప్రజెంట్ చేయనున్నారు. ఆ పథకాల్లో రైతు బంధు, రైతు బీమా స్కీమ్‌లు కూడా ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా.. వినూత్న వ్యవసాయ విధానాలను ఐక్యరాజ్యసమితి ప్రోత్సహిస్తున్నది. ఈ వినూత్న విధానాల ద్వారా రైతు కుటుంబాలను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఎఫ్ఏవో ముందుకు వెళ్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ పథకాలను ఆయా దేశాలకు చెందిన నిపుణులు వివరించనున్నారు. ఆహార వ్యవస్థలో మార్పులు తీసుకురావలన్న ఉద్దేశంతో వినూత్న పథకాలకు ఎఫ్ఏవో చేయూతనిస్తున్నది. రైతుబంధు పథకంపై రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సీ. పార్థసారధి ప్రసంగం చేయనున్నారు. ఈనెల 22వ తేదీన ఆయన సదస్సులో మాట్లాడుతారు. పటిష్టమైన వ్యవసాయ వినూత్న వ్యవస్థలను ఎలా నిర్మించాలన్న అంశంపై సదస్సులో చర్చిస్తారు. తెలంగాణ రైతులను ఈ రెండు పథకాలు ఎలా ఆదుకున్నాయి, వారి కష్టాలను ఎలా తీర్చాయి, పథకం అమలులో ఎదురైన అవాంతరాలు, ఆ పథకాలు ఎలా ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయో పార్థసారథి తన ప్రసంగంలో వివరించనున్నారు.




