నగర ప్రచారంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్,నవంబర్ 26(జనంసాక్షి): ఒక్క వ్యక్తిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని మంత్రి కేటీఆర్ ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని.. అయితే సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని పెద్దలు అన్నమాటను గుర్తుచేశారు.సోమాజిగూడలో తెరాస అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు ఒక వ్యక్తిని ఓడించేందుకు కలిసాయంటే.. ఎవరు బలవంతులో అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రజాకూటమి పొరపాటున గెలిస్తే నెలన్నరకో సీఎం మారతాడని ఎద్దేవా చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. తెరాస ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిందని కేటీఆర్ అన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. ప్రజాకూటమిలో సీఎంను నిర్ణయించాలంటే దిల్లీ నుంచి నిర్ణయించాలని.. అదీ సీల్డ్ కవర్‌లోనని విమర్శించారు. తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావాలా?.. లేదా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి కేసీఆర్ సీఎం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. తరవాత
మంత్రి కేటీఆర్ నగరంలోని గౌలిగూడలో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు గౌలిగూడ చమాన్‌లో చాలామంది ఉన్నారన్నారు. తాను కూడా చిన్నప్పుడు గౌలిగూడ స్కూల్‌లోనే చదువుకున్నట్టు మంత్రి తెలిపారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.




